కోతి కథతో రవితేజ సూపర్ హీరో మూవీ.. బిగ్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ

కోతి కథతో రవితేజ సూపర్ హీరో మూవీ.. బిగ్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ

టాలీవుడ్ లో వచ్చిన మొట్టమొదటి సూపర్ హీరో మూవీ హనుమాన్(HanuMan). ప్రశాంత్ వర్మ(Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. యంగ్ హీరో తేజ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాలో  అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ప్రేక్షకులను ఫిదా చేసింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపించింది ఈ మూవీ. విడుదలైన కేవలం 15 రోజుల్లోనే ఏకంగా రూ.250 కోట్లకుక్ పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ గ్రాటిట్యూడ్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. 

ఇందులో భాగంగా రవితేజతో ఒక సినిమా ఉండబోతుందని ప్రకటించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అయితే.. కథ ఇంకా  రవితేజ గారికి చెప్పలేదని, ఆయన ఒప్పుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని వెల్లడించారు ప్రశాంత్. ఇక హనుమాన్ సినిమాలో కోటి పాత్రలో ఒక కోతి  కనిపించిన విషయం తెలిసిందే. ఆ కోతి పాత్రకు రవితేజ డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు అదే పాత్రను ప్రధానంగా చేసుకొని ఓ సినిమా చేయాలని ఐడియా వచ్చిందని, త్వరలోనే ఆ ఐడియాను రవితేజ గారికి చెబుతానని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. ఇక నందమూరి బాలకృష్ణ కోసం కూడా కొన్ని కథలు సిద్ధం చేశామని, త్వరలోనే దానిపై  కూడా అధికారిక ప్రకటన ఉంటుందని చెప్పుకొచ్చారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ప్రశాంత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేస్తున్న సినిమా విషయానికి వస్తే.. కళ్యాణ్ దాసరి హీరోగా అధీరా అనే సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. అతి త్వరగా ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. మరి హనుమాన్ తరువాత మరోసారి సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ప్రశాంత్ ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.