- రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం: మంత్రి ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు టౌన్‌షిప్‌లో నిర్మించిన డబుల్ ఇండ్ల ప్రాజెక్ట్ ఆసియా ఖండంలోనే అతి పెద్దదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ నెల 22న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఇక్కడి డబుల్ ఇండ్లను ప్రారంభించి, మొదట ఆరుగురు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం ఈ ప్రాజెక్టును జీహెచ్‌ఎంసీ, హౌసింగ్ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.
15,600 డబుల్ ఇండ్లను పేదల కోసం 100 శాతం సబ్సిడీతో పూర్తి ఉచితంగా కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్నది పేర్కొన్నారు. ఈ ఇండ్లలో 60 వేల మంది నివసించొచ్చని, 103 షాపింగ్ కాంప్లెక్స్‌లు, కమ్యూనిటీ హాల్, పోలీస్ స్టేషన్, లిఫ్ట్‌లు, మంచి నీళ్లు, డ్రైనేజీ, రోడ్లు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉంటాయని మంత్రి వివరించారు. ఈ ప్రాంతం భవిష్యత్తులో మున్సిపాలిటీ అయ్యే అవకాశం ఉందని చెప్పారు.
అమరవీరుల స్థూపం పనుల పరిశీలన..
గురువారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సమీపంలో నిర్మించిన అమరవీరుల స్థూపాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 3.29 ఎకరాల్లో రెండు బేస్‌మెంట్లతో 6 ఫ్లోర్లు ఉన్నాయి. మంగళవారం అమరవీరుల స్థూపం పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించి, మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.