IND vs AUS: స్కానింగ్‌కు బుమ్రా.. గాయంపై ప్రసిద్ కృష్ణ క్లారిటీ

IND vs AUS: స్కానింగ్‌కు బుమ్రా.. గాయంపై ప్రసిద్ కృష్ణ క్లారిటీ

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన ఐదో టెస్టులో రోహిత్ శర్మ స్థానంలో టీమిండియా కెప్టెన్సీ చేపట్టిన జస్‌ప్రీత్ బుమ్రా రెండో రోజు ఆటలో గాయపడ్డాడు. దీంతో ఈ ఫాస్ట్ బౌలర్ సిడ్నీ టెస్టు రెండో రోజు ఆట మధ్యలో మైదానాన్ని వీడాడు. స్కానింగ్ కోసం బుమ్రా  మెడికల్‌ సిబ్బందితో కలిసి స్కానింగ్‌కు వెళ్ళాడు. సూపర్ ఫామ్ లో ఉన్న బుమ్రా హాస్పిటల్ కు వెళ్లడంతో అతడికి ఏమైందనే విషయంలో భారత అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా బుమ్రా గాయంపై సహచర ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ కృష్ణ క్లారిటీ ఇచ్చాడు. 

బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రసిద్ కృష్ణ అన్నాడు. ప్రస్తుతం బుమ్రా బీసీసీఐ వైద్య పర్యవేక్షణలో ఉన్నాడని.. రేపటి లోపు కోలుకోవాలని జట్టు ఆశిస్తుందని ప్రసిద్ కృష్ణ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ప్రస్తుత ఆధిక్యం 145 పరుగులకు చేరింది. క్రీజులో రవీంద్ర జడేజా (8 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (6 నాటౌట్) ఉన్నారు.

సిరీస్‌లో ఇప్పటివరకు 32 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. తొలిరోజు ఆటలో నంబర్ 10 బ్యాటర్‌గా 17 బంతుల్లో 22 పరుగులు చేశాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా రేపటిలోపు కోలుకోకపోతే విరాట్ కోహ్లీ భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు.