రాజన్న గుడిని 24 గంటలూ తెరిచి ఉంచొద్దు: ప్రతాప రామకృష్ణ

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని 24 గంటలూ తెరిచి ఉంచడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని అనువంశిక ట్రస్ట్ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ చెప్పారు. భక్తుల రద్దీ పేరుతో ఆలయ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని సూచించారు. శుక్రవారం అనువంశిక బ్రాహ్మణ సంఘం నాయకులతో కలిసి ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ తో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ.. ఆలయ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా దేవాలయ టైమింగ్స్​మారుస్తున్నారని మండిపడ్డారు. కేవలం ఆదాయంపైనే దృష్టి పెడుతూ.. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. రాత్రిళ్లు ఆలయాన్ని తెరిచి ఉండడంతో స్వామి వారికి పవళింపు సేవ, ఉదయం సుప్రభాతం సేవలకు ఆటంకం కలుగుతోందన్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన తిరుమల, బాసర, యాదాద్రి, భద్రాచలం, కొండగట్టు, ధర్మపురి దేవాలయాలను పవళింపు సేవ కాగానే క్లోజ్​చేస్తారని, వేములవాడలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కనీసం అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటలు పాటు దర్శనాలను బంద్​చేయాలని కోరారు. శృంగేరి, కంచి కామకోటి పీఠాధిపతుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.