భద్రాచలం, వెలుగు : ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చేపట్టిన పనులు ఈనెల15లోపు 90శాతం పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్ అధికారులను ఆదేశించారు. స్పెషల్ ఆఫీసర్లతో మంగళవారం ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. స్కూళ్లు తెరిచే నాటికి సదుపాయాలు సిద్ధంగా ఉండాలన్నారు. గదుల్లో గాలి, వెలుతురు చక్కగా ఉండేలా తీర్చిదిద్దాలని చెప్పారు. టాయిలెట్లు, బాత్ రూమ్‌ల్లో నీటి సదుపాయం, మైనర్ రిపేర్లు పూర్తి చేయాలని, అవసరమైన చోట మంచినీటి బోర్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఏపీవో జనరల్ డేవిడ్‌రాజ్, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.
నాటు వైద్యం జోలికి పోనీయకుండా చూడాలి
మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాల్లో గిరిజనులు మూఢనమ్మకాలతో నాటు వైద్యం జోలికి పోనీయకుండా మెడికల్ ఆఫీసర్లు చూడాలని ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్ ఆదేశించారు. మంగళవారం మెడికల్ ఆఫీసర్లతో ఆయన రివ్యూ నిర్వహించారు. జిల్లాలో వైరల్ ఫీవర్లు ప్రబలుతున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఆశావర్కర్లు ఇంటింటికీ వెళ్లి బ్లడ్ శాంపిల్స్ సేకరించి టెస్టింగ్‌కు పంపించాలన్నారు. ఆర్ఎంపీలు పరిధిని దాటి వైద్యం అందిచొద్దని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి మూఢనమ్మకాల వైపు ఆదివాసీలు వెళ్లకుండా చైతన్యపరచాలన్నారు. గర్భిణులు, చిన్నారులకు అందించే వైద్యం విషయంలో అలర్ట్ ఉండాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్‌వో భాస్కర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో రాజ్‌కుమార్, జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.