
భారత మహిళల నయా ఓపెనర్ ప్రతీకా రావల్ వన్డే క్రికెట్ లో తన అసాధారణ నిలకడ చూపిస్తుంది. 24 ఏళ్ళ ఈ ఓపెనర్ తొలి మ్యాచ్ నుంచి భారీ స్కోర్లు చేస్తూ సంచలనంగా మారింది. కనీసం 10 మ్యాచ్ లు ఆడకుండానే ప్రపంచ రికార్డ్ ను నెలకొల్పింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న ట్రై సిరీస్ లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేసిన రావల్.. వన్డే కెరీర్ లో 500 పరుగులు పూర్తి చేసుకుంది. 500 పరుగుల మార్క్ ను ప్రతీకా కేవలం 8 ఇన్నింగ్స్ ల్లోనే సాధించడం విశేషం. దీంతో మహిళల వన్డే క్రికెట్ లో వేగంగా 500 పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచి తన ఖాతాలో ప్రపంచ రికార్డ్ ను వేసుకుంది.
అంతకముందు ఈ రికార్డ్ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ షార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉంది. ఈ ఇంగ్లీష్ బ్యాటర్ కేవలం తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 500 వన్డే పరుగులు సాధించగా.. ప్రతీకా రావల్ నేడు ఈ రికార్డ్ బ్రేక్ చేసింది. ట్రై సిరీస్ లో భాగంగా మంగళవారం కొలంబో వేదికగా (ఏప్రిల్ 29) సౌతాఫ్రికాపై జరిగిన మ్యాచ్ లో ప్రతీకా రావల్ ఈ ఘనతను అందుకుంది. ఈ మ్యాచ్ లో 500 పరుగులు చేయడానికి ఆరు పరుగులు అవసరం కాగా.. ఆమె ఏకంగా 78 పరుగులు చేసి భారత జట్టు టాప్ స్కోరర్ గా నిలిచింది. తొలి వికెట్ కు స్మృతి మందానతో 83 పరుగులు జోడించి భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించింది.
►ALSO READ | DC vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. ముగ్గురు స్పిన్నర్లతో కోల్‌కతా
ప్రతీకా రావల్ జోరు చూస్తుంటే వన్డే వరల్డ్ కప్ లోనూ షెఫాలీ వర్మకు చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఓపెనర్ గా అద్భుతంగా ఆడడంతో వరల్డ్ కప్ లోనూ ప్రతీకానే కొనసాగించే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నారు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే భారత మహిళల జట్టు సౌతాఫ్రికా మహిళలపై 15 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది.
మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన క్రీడాకారిణి
ప్రతీకా రావల్ (భారతదేశం) - 8 ఇన్నింగ్స్‌లు
షార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్) - 9 ఇన్నింగ్స్
కాథరిన్ బ్రైస్ (స్కాట్లాండ్) - 10 ఇన్నింగ్స్
నికోల్ బోల్టన్ (ఆస్ట్రేలియా) - 11 ఇన్నింగ్స్
వెండి వాట్సన్ (ఇంగ్లాండ్) - 12 ఇన్నింగ్స్
బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా) - 12 ఇన్నింగ్స్
What a start to Pratika Rawal's ODI career - the fastest woman to 500 ODI runs 🌟 pic.twitter.com/8mRm2EYF3D
— ESPNcricinfo (@ESPNcricinfo) April 29, 2025