మెడిసిన్ బంద్​ చేసి డ్రగ్స్​ తయారీ

మెడిసిన్ బంద్​ చేసి డ్రగ్స్​ తయారీ
  • రూ. కోట్ల బిజినెస్​
  • 2007లో ప్రవాహ్ లేబోరేటరీస్​​ గా ఏర్పాటు
  • 2017 నుంచి శ్రీ యాదాద్రిగా పేరు మార్పు
  • ఎంప్లాయిస్​కు జీతాలు సరిగా ఇవ్వలే
  • గుట్టు రట్టయి చివరకు సీజ్

యాదాద్రి, వెలుగు : మెడిసిన్​ తయారు చేయడానికి ఏర్పాటు చేసిన కంపెనీ..పేరు మార్చుకుంది. కంపెనీ ఎంప్లాయీస్​కు జీతాలు సరిగా ఇవ్వలే. ప్రాణాలు కాపాడే మెడిసిన్​ తయారీ నుంచి మత్తుతో చిత్తు చేసే డ్రగ్స్​ తయారుచేసే స్థితికి చేరుకుంది. చివరకు సీజ్​ అయింది. 2007లో ప్రవాహ్ ల్యాబొరేటరీ  పేరుతో యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజీపేట శివారులో ఈ కంపెనీ ఏర్పడింది. ఈ కంపెనీలో మెడిసిన్​ కోసం పౌడర్ తయారు చేసి ప్రముఖ ల్యాబ్​లకు సరఫరా చేసేవారు. ఈ కంపెనీలో వెటర్నరీ మెడిషన్​ కూడా తయారు చేసేవారు. 

అయితే కంపెనీ ఏర్పాటులో కీలకమైన వ్యక్తి మృతి చెందిన తర్వాత   ఇబ్బందులకు గురైంది. 2017 నుంచి శ్రీ యాదాద్రి ఫార్మాస్యూటికల్ కంపెనీగా పేరు మార్చుకొని హైదరాబాద్​లోని బాలానగర్​లో కార్పొరేట్​ కార్యాలయం ఏర్పాటు చేసి,  కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీకి ప్రస్తుతం వాసుదేవరావు పర్యవేక్షిస్తున్నారు. ఇందులో టెక్నిషియన్​గా ఉంటున్న సంతోష్​ (ఇతడిని పోలీసులు అరెస్ట్​ చేశారు) తల్లి కంపెనీ బోర్డు మెంబర్​గా ఉన్నారు. అనంతర   అందులో పని చేసే ఎంప్లాయిస్​కు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుకుంది. 

చాలా  మంది ఎంప్లాయిస్​కు ఆరు నెలలకు పైగా జీతాలు బకాయిలు ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో ఎంప్లాయిస్ ఉద్యోగాలు మానేసి వేర్వేరు చోట్ల చేరిపోయారు. ఇటీవలే పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు మూడుసార్లు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ కంపెనీల్లో కార్యకలాపాలు నిలిపివేశారు. ఈ పరిస్థితుల్లో జీడిమెట్లకు చెందిన ఇస్మాయిల్​ పరిచయంతో నిషేధిత మత్తు పదార్థాలైన ఎఫెడ్రిస్​, మెఫెడ్రోస్​  తయారీకి తెరలేపారు. వీటిని తయారు చేయడంతో పాటు రవాణా చేస్తూ రూ. కోట్ల బిజినెస్​ చేస్తున్నారు. వీటిని రవాణా చేయడానికి పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. 

పోలీసుల కంట్లో పడకుండా టోల్​గేట్లు తప్పించుకునే విధంగా రూట్​ మ్యాప్​ తయారు చేసుకొని తరలిస్తున్నారు. మత్తు పదార్థాలను తరలించే వెహకల్​కు ఎస్కార్ట్​ గా మరో వెహికల్​ సమకూరుస్తూ దొరకకుండా తప్పించుకుంటున్నారు. చివరకు పక్కా సమాచారంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, జిల్లా పోలీసుల ద్వారా  శ్రీ యాదాద్రి ఫార్మాస్యూటికల్ కంపెనీ డ్రగ్స్​ దందా  గుట్టును రట్టయి కంపెనీ సీజ్​ చేసేవరకూ వెళ్లింది. మెడిసిన్​ తయారీ కోసం ఏర్పాటు చేసిన కంపెనీ డ్రగ్​ తయారు చేస్తున్న విషయం జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.