
హైదరాబాద్ : వరంగల్‌కు చెందిన విద్యార్థిని ప్రవల్లిక తల్లిదండ్రులను నర్సంపేట పోలీసులు ప్రగతిభవన్ కు తీసుకెళ్తున్నారు. భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. ప్రవల్లిక పేరెంట్స్ తో సీఎం కేసీఆర్ పర్సనల్ గా మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రవల్లిక పేరెంట్స్ ను పోలీసులు తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అక్టోబర్ 13వ తేదీ శుక్రవారం రోజు వరంగల్ కు చెందిన మర్రి ప్రవల్లిక చిక్కడపల్లిలోని బృందావన్ గర్ల్స్ హాస్టల్ లో ఉరేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. రెండేళ్లుగా అశోక్ నగర్ లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతోంది. ప్రవల్లిక ఆత్మహత్య విషయం తెలియగానే నిరుద్యోగులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, పలు రాజకీయ పార్టీల నాయకులు చిక్కడపల్లికి చేరుకుని ఆందోళనలు, నిరసనలు చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తెలెత్తాయి. ప్రవల్లిక మృతిపై పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు స్పందించారు. కేసీఆర్ సర్కారే ప్రవల్లిక మృతికి కారణమంటూ ఆరోపించారు.
మరోవైపు.. ప్రవల్లిక మృతికేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో చిక్కడపల్లి సీఐ పిడమర్తి నరేశ్‌ను సస్పెండ్ చేశారు. శాంతిభద్రతలను కాపాడడంలో చిక్కడపల్లి సీఐ నరేశ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఆదివారం (అక్టోబర్ 15) ఆయనకు ఉత్తర్వులు జారీ చేశారు.