- మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ సిటీ, వెలుగు : గల్ఫ్ కార్మికుల సమస్యలు చెప్పుకునేందుకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రవాసీ ప్రజావాణి కౌంటర్ ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం సౌదీ అరేబియాలో ఇటీవల చనిపోయిన చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పులి అంజయ్య కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రొసీడింగ్స్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ఎక్స్ గ్రేషియా ఇవ్వడం దేశ చరిత్రలోనే ప్రథమమన్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు త్వరలో అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.