హుజూర్ నగర్, వెలుగు : సెల్ ఫోన్ కు బానిసైన కొడుకును తల్లిదండ్రులు మందలించడంతో ఉరేసుకున్నాడు. బ్రెయిన్ డెడ్ కావడంతో అతడి అవయవాలను దానం చేశారు. పోలీసుల కథనం ప్రకారం..సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లక్కవరం గ్రామానికి చెందిన ఓరుగంటి శ్రీనివాస్ బైక్ మెకానిక్. ఇతడికి కొడుకు ఓరుగంటి ప్రణీత్ కుమార్ (13) కోదాడలోని ఓ ప్రైవేట్స్కూల్లో 6 వతరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవుల్లో లక్కవరంలోని ఇంటికి వచ్చాడు.
అప్పటి నుంచి తల్లిదండ్రుల ఫోన్లతోనే గడిపేవాడు. తండ్రి ఇంట్లో ఉన్నంత సేపు అతడి ఫోన్ను, అతడు పనికి వెళ్లాక తల్లి ఫోన్ను ఉపయోగించేవాడు. రోజంతా దాదాపు ఫోన్పట్టుకునే ఉండడంతో ఈనెల14న తల్లిదండ్రులు మందలించారు. తర్వాత పేరెంట్స్ఊరెళ్తుంటే వెంట రమ్మన్నా రాలేదు. వారు వెళ్లాక ఇంట్లో ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు హుజూర్ నగర్ ఏరియా దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ తరలించారు. పరిస్థితి విషమించగా, గురువారం మధ్యాహ్నం బ్రెయిన్ డెడ్ అయ్యిందని డాక్టర్లు ప్రకటించారు. దీంతో ప్రణీత్తల్లిదండ్రులు అతడి అవయవాలను దానం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కట్టా వెంకట రెడ్డి తెలిపారు.