కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి కాంగ్రెస్ సీటును ఆశించి భంగపడ్డ, సీనియర్ లీడర్, టీపీపీసీసీ డాక్టర్ సెల్ స్టేట్ వైస్ చైర్మన్ డాక్టర్ దాసారపు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం రాత్రి బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, జిల్లా ప్రెసిడెంట్ ఎంవీ గుణ సమక్షంలో బీఎస్పీలో చేరారు. మందమర్రిలోని సింగరేణి కుటుంబానికి చెందిన డాక్టర్ శ్రీనివాస్, ఆయన భార్య డాక్టర్ విద్యావర్ధిని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లో శ్రీవిద్య ఆసుపత్రులను నడుపుతున్నారు.
చెన్నూరు సీటు కోసం ఇటీవల కాంగ్రెస్ అధిష్టానానికి దంపతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇద్దరిలో ఒక్కరికైనా టికెట్ఇవ్వాలని హైకమాండ్‌ను కోరారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తాను స్థానికుడినని, టికెట్ఇస్తే ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ఓడిస్తానని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌ను వీడి బీఎస్పీలో చేరారు. చెన్నూరు నుంచి బీఎస్సీ అభ్యర్థిగా బరిలో దిగడం దాదాపు ఖారారైనట్లు తెలుస్తోంది. బుధవారం ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.