గురుకులాలపై ప్రవీణ్ ముఠా కుట్రలు : మేడిపల్లి సత్యం

  • కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

హైదరాబాద్, వెలుగు: గురుకులాలపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఠా కుట్రలు చేస్తున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. శనివారం అసెంబ్లీలోని సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. బీర్ఎస్ అగ్ర నేతలైన కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతోనే ప్రవీణ్ కుమార్ తన ముఠాతో చేస్తున్న కుట్రల ఫలితంగానే ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగుతున్నాయని ఆయన తెలిపారు. 

స్వేరో వంటి ప్రైవేటు సైన్యాన్ని ప్రవీణ్ కుమార్ తయారు చేసినట్టు గతంలో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాల్ రాజ్, బాల్క సుమన్ లు ఆరోపించిన విషయాన్ని ఎమ్మెల్యే సత్యం గుర్తు చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఘటనలు చూస్తే ప్రవీణ్ పై వారు చేసిన ఆరోపణలు నిజమేనేమోనని అనిపిస్తుందన్నారు. 

ఇప్పటికైనా ప్రవీణ్ కుమార్ తన కుట్రలు, రెచ్చగొట్టే చర్యలను మానుకుని విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ సమాజంలో ప్రవీణ్ కుమార్ కు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చినా బీఆర్ఎస్ నేతల బుద్ధి మాత్రం మారలేదని, రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి అదే గతి పడుతుందన్నారు.