వరంగల్ జిల్లా కలెక్టర్​ డా.బి.గోపి అనూహ్య బదిలీ

వరంగల్ జిల్లా కలెక్టర్​ డా.బి.గోపి అనూహ్య బదిలీ
  • ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జనరల్ అడ్మినిస్ట్రేషన్​లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు​ ​ 
  • రాజకీయ కారణాల వల్లేనని ప్రచారం


హనుమకొండ, వెలుగు: వరంగల్ జిల్లా కలెక్టర్​డా.బి.గోపిని రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేసింది. గ్రేటర్​ వరంగల్ మున్సిపల్​ కార్పొరేషన్ ​ కమిషనర్ గా ఉన్న పి.ప్రావీణ్యను వరంగల్ ​కలెక్టర్​గా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గోపిని హైదరాబాద్​లోని జనరల్​అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్​మెంట్​ లో రిపోర్ట్​ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆయన నుంచి సోమవారం సాయంత్రం ప్రావీణ్య కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించారు. జీడబ్ల్యూఎంసీ  కమిషనర్​గా ఉన్న ప్రావీణ్యను బదిలీ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. దీంతో మరో అధికారి వచ్చేవరకు కమిషనర్​గా ఆమే కొనసాగనున్నారు.

పోస్టింగ్​ ఇవ్వకుండా.. 

కలెక్టర్​ గోపిని అనూహ్యంగా బదిలీ చేయడంపై హనుమకొండ, వరంగల్​ జిల్లాల్లో చర్చ జరుగుతోంది. సోమవారం ఉదయం గ్రీవెన్స్​ తో పాటు ఆయుర్వేదిక్​ శిబిరాన్ని ప్రారంభించే కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన సాయంత్రానికల్లా బదిలీ కావడం, ఎక్కడా  పోస్టింగ్​ ఇవ్వకుండా జనరల్ అడ్మినిస్ట్రేషన్​లో రిపోర్టింగ్​ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నుంచి ఉత్తర్వులు వెలువడటంపై వివిధ రకాలుగా ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు నేతల ఒత్తిడే ఇందుకు కారణమన్న చర్చ సాగుతోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన కలెక్టర్ల బదిలీల్లోనే గోపి ట్రాన్స్​ఫర్​ కావాల్సి ఉండగా.. అప్పుడు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అడ్డుకున్నట్లు  తెలిసింది. మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో ప్రతిమ క్యాన్సర్​ఇన్​స్టిట్యూట్​ఆధ్వర్యంలో మహిళలకు ఫ్రీ స్క్రీనింగ్​క్యాంప్​ నిర్వహించగా.. అక్కడ ఓ నేత ఫిర్యాదు మేరకు కలెక్టర్ పై మంత్రి కేటీఆర్​ కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.  తర్వాత తొర్రూరులో మహిళలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించినా కలెక్టర్​ వెళ్లకపోవడం పట్ల మంత్రి కేటీఆర్​అసహనంతో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లపై ఫిర్యాదులు వెల్లువెత్తినా పట్టించుకోలేదని, గ్రీవెన్స్​ సమస్యల పరిష్కారంలోనూ  నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కలెక్టర్​పై బదిలీ వేటు వేశారని ప్రచారం జరుగుతోంది. 2016 బ్యాచ్​కు చెందిన గోపి 2021 సెప్టెంబర్​ ఒకటో తేదీన వరంగల్​ కలెక్టర్​గా బాధ్యతలు తీసుకోగా..  దాదాపు 18 నెలలపాటు ఇక్కడ విధులు నిర్వర్తించారు.