
విజయవాడలో ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సీఎం జగన్ త్వరగా కోలుకుని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు జగన్‌పై రాయి దాడిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఖండించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదన్నారు. మన ప్రజాస్వామ్యంలో సభ్యత, గౌరవాన్ని పరస్పరం కాపాడుకుందాం. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అని ట్వీట్ చేశారు.
I pray for the speedy recovery and good health of Andhra Pradesh CM @ysjagan Garu.
— Narendra Modi (@narendramodi) April 13, 2024
జగన్ పై జరిగిన దాడిని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఖండించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. జగన్‌పై దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. జాగ్రత్త జగన్ అన్న. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు.
సీఎం వైఎస్ జగన్‌పై ఓ ఆగంతకుడు రాయితో దాడి చేశాడు. దాంతో ఆయన ఎడమ కనుబొమ్మపై భాగంలో గాయమయ్యింది. బస్సు యాత్రలో భాగంగా జగన్ శనివారం.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ బస్సు పైనుంచి ప్రజలకు అభివాదం చేశారు. జనం పూలు జల్లుతూ ఆయనకు స్వాగతం పలికారు. అంతలో ఓ గుర్తుతెలియని వ్యక్తి పూలతో పాటుగా రాయిని కూడా విసిరాడు. అది నేరుగా జగన్ ఎడమ కనుబొమ్మపై భాగంలో తగిలింది. ఈ ఘటనలో బస్సుపై ఉన్న వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా గాయమైంది. డాక్టర్లు వెంటనే ఇద్దరి గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. చికిత్స తర్వాత జగన్ మళ్లీ బస్సు యాత్ర కొనసాగించారు.