మహాకుంభమేళాలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం ( ఫిబ్రవరి 12) మాఘ పౌర్ణమి సందర్భంగా మంగళవారం రాత్రి నుంచే భక్తులు భారీగా పుణ్య స్నానాలుఆచరించారు. ఇప్పటికి ఈ రోజు దాదాపు 73 లక్షల మందికి ( ఉదయం 6 గంటల వరకు) త్రివేణి సంగమంలో మాఘ పౌర్ణిమ స్నానమాచరించారు. ఇంకా భారీగా భక్తులు తరలి వస్తున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మహా కుంభమేళా ప్రాంతంలోకి వాహనాలను నిషేధించారు. ప్రయాగ్‌రాజ్ నగరంలోకి అత్యవసరమైన సేవల వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా పవిత్ర స్నానాలు ఆచరించడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాగ్ రాజ్ కు వచ్చే భక్తులు ట్రాఫిక్ నియమాలను పాటించి... పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను పార్క్ చేయాలని అధికారులు సూచించారు. కుంభమేళా ఏర్పాట్లను సీఎం యోగి లక్నో నుంచి పర్యవేక్షిస్తున్నారు.
కుంభమేళాలో మాఘ పౌర్ణమిరోజు పుణ్యస్నానం చేయు భక్తులకు సీఎం యోగి శుభాకాంక్షలు తెలిపారు. సాధువులు, అఖాడాలు, సన్యాసులు , కల్పవాసిలకు.. కుంభమేళాకు తరలి వచ్చిన భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ హరి అనుగ్రహంతో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు. శుభాలు.. ఉండాలని కోరుకుంటున్నాను. గంగా..యమునా .. సరస్వతి మాతలు అందరి కోరికలను నెరవేరుస్తారని యూపీ సీఎం యోగి సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.మహా కుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా జరిగే చివరి అమృత స్నానంతో ముగుస్తుంది.