కుంభమేళాలో ప్రమాదం.. ప్రయాగ్ రాజ్లో 15 మందితో వెళ్తున్న బోటు బోల్తా

కుంభమేళాలో ప్రమాదం.. ప్రయాగ్ రాజ్లో 15 మందితో వెళ్తున్న బోటు బోల్తా

ప్రయాగ్ రాజ్: కుంభమేళాలో బోటు ప్రమాదం జరిగింది. 15 మంది భక్తులతో వెళ్తున్న ఆర్మీ బోటు బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. భక్తులను తీసుకెళ్తున్న ఆర్మీ బోట్ను మరో బోట్ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. సోమవారం (ఫిబ్రవరి 24) అరైల్ ఘాట్ దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర, కేంద్ర భద్రతా బలగాలు (SDRF and NDRF) రంగంలోకి దిగి భక్తులను కాపాడాయి. నీళ్లలో మునిగిన భక్తులను భద్రతా దళాలు కాపాడటంతో ప్రమాదం తప్పింది. 

ఈ ఘటనపై ప్రయాగరాజ్ ఎస్పీ శ్వేతాబ్ పాండే మాట్లాడుతూ.. మరో బోట్లో వచ్చి ప్రమాదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని, ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జనవరి 13 నుంచి కుంభమేళా జరుగుతోంది. ఫిబ్రవరి 26న కుంభమేలా ముగుస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 60 కోట్ల భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం తెలిపింది.

మహా కుంభమేళాను పొడిగించబోమని ప్రయాగ్ రాజ్ జిల్లా కలెక్టర్ రవీంద్ర కుమార్ మంధాడ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కుంభమేళాను పొడిగిస్తారని సోషల్ మీడియాలో కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, అవన్నీ ఒట్టి పుకార్లని, వాటిని నమ్మకూడదని ఆయన సూచించారు. మేళాను పొడిగిస్తామని యోగి సర్కారు ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదని, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే దాకా మేళాను పొడిగించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రయాగ్​రాజ్ మహాకుంభ మేళాలో తొక్కిసలాట జరిగి 30 మంది భక్తులు చనిపోయిన విషయం విదితమే. 60 మంది గాయపడ్డారు. రష్ కంట్రోల్ చేసేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతోనే తొక్కిసలాట జరిగిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.