
- చివరిరోజు 2.5 కోట్ల మంది.. ముగిసిన మహా కుంభమేళా
- 45 రోజుల్లో 66 కోట్లకు పైగా భక్తుల పుణ్య స్నానాలు
- కాశీ విశ్వనాథుడికి నాగ సాధువుల ప్రత్యేక పూజలు
- పేష్వాయి ఊరేగింపుతో మేళా అధికారికంగా ముగింపు
- ఉత్సాహంగా పాల్గొన్న 10 వేల మంది నాగ సాధువులు
- ఒకట్రెండు రోజుల్లో తిరిగి హిమాలయాలకు పయనం
- చెత్త తొలగించేందుకు రంగంలోకి పారిశుధ్య కార్మికులు
- మహా కుంభమేళా సక్సెస్‌తో సాధుసన్యాసుల హర్షం
మహాకుంభనగర్(యూపీ): ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళా బుధవారంతో ముగిసింది. జనవరి 13న ప్రారంభమైన మేళా.. 45 రోజులు కొనసాగింది. సుమారు 66 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. చివరి రోజైన మహా శివరాత్రి నాడు కూడా ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. సుమారు 2.50 కోట్లకు పైగా భక్తులు స్నానాలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ‘హర హర మహాదేవ్’ నామస్మరణలతో త్రివేణి సంగమంలోని అన్ని ఘాట్లు మార్మోగాయి.
తెల్లవారుజామున హెలికాప్టర్ల ద్వారా భక్తులపై పూలు చల్లారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గోరఖ్‌పూర్ నుంచి సీఎం యోగి బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఏర్పాట్లపై సమీక్ష చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ తగిన సలహాలు, సూచనలు చేశారు. కుంభమేళా ముగియడంతో భక్తులు క్షేమంగా తిరుగు పయనం అయ్యేందుకు రైల్వే శాఖ.. ప్రయాగ్‌రాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు 350 రైళ్లను నడుపుతోంది.
పేష్వాయి ఊరేగింపుతో ముగింపు వేడుకలు
ఏడు అఖాడాలు సాధువులు బుధవారం పేష్వాయి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలతో మహా కుంభ మేళాను అధికారికంగా ముగించారు.
పేష్వాయి ఊరేగింపులో 10,000 మందికి పైగా నాగ సాధువులు పాల్గొన్నారు. కాశీ వీధులన్నీ నాగసాధువులతో నిండిపోయాయి. నగరవాసులు కూడా ఈ ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాశీ రోడ్ల గుండా తమ దేవతలు, జెండాలతో, త్రిశూలాలు, కత్తులు, గదలను ప్రదర్శిస్తూ ‘హర హర మహాదేవ్’ నినాదాలు చేశారు. పాటలు, నృత్యాలతో ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ఒకట్రెండు రోజుల్లో నాగ సాధువులంతా హిమాలయాలకు తిరిగి వెళ్లనున్నారు.
రంగంలోకి దిగిన పారిశుధ్య కార్మికులు
మహా శివరాత్రి రోజున అర్ధరాత్రి నుంచే భక్తులు త్రివేణి సంగమానికి చేరుకున్నారు. బ్రహ్మ ముహూర్తం కోసం వేచి చూశారు. అనంతరం పుణ్య స్నానాలు ఆచరించారు. గంగా మాతకు ప్రత్యేక పూజలు చేశారు. సూర్య భగవానుడికి జల సమర్పణ చేసి హారతి ఇచ్చారు. నేపాల్ నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు.
మేళా ప్రాంతాన్ని క్లీన్ చేసేందుకు పారిశుధ్య కార్మికులు కూడా రంగంలోకి దిగారు. కాగా, 45 రోజుల పాటు సాగిన అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో ప్రధానంగా 6 ముహూర్తాల్లో పుణ్య స్నానాలు చేసేందుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తారు. జనవరి 29న మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు చనిపోగా.. 60 మంది గాయపడ్డారు.
మేళా సక్సెస్‌పై సాధుసన్యాసుల హర్షం
మహాకుంభ మేళా అధికారిక ముగింపు సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. మేళా ఏరియాలో ఎయిర్ షో నిర్వహించింది. ఢిల్లీ స్పీకర్ విజేందర్ గుప్తా మేళా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు థ్యాంక్స్ చెప్పారు. 45 రోజులు సాగిన ఆధ్యాత్మిక వేడుకలో యువత పాల్గొనడంపై కంచికి చెందిన శంకరాచార్య, కామకోఠి పీఠానికి చెందిన విజేంద్ర సరస్వతి స్వామిగల్ హర్షం వ్యక్తం చేశారు.
ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ఆ మహాశివుడిని వేడుకున్నారు. కుంభ మేళా సక్సెస్ కావడంతో సాధ్వి భగవతి సరస్వతి సంతోషం వ్యక్తం చేశారు. వివిధ దేశాల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అమెరికా మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది కుంభమేళాకు హాజరైనట్లు తెలిపారు.
బ్రెజిల్, లండన్, మెక్సికో, వాషింగ్టన్ నుంచి వచ్చిన భక్తులు తమ ఆధ్యాత్మిక భావనను వ్యక్తపర్చారు. మహా కుంభ మేళాపై న్యూయార్క్‌లో ఇండియన్ కాన్సుల్ ఏర్పాటు చేసిన చర్చా వేదికలో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
మళ్లీ కుంభ మేళా ఎప్పుడు?
వచ్చే ఐదేండ్లలో హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్‌రాజ్ ప్రాంతాల్లో కుంభమేళా జరగనుంది. 2027 హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా ఏర్పాటు చేయనున్నారు. 2027లో నాసిక్‌లో కుంభమేళా జరగనున్నది. జులై 17న ప్రారంభమయ్యే ఈ కుంభమేళా ఆగస్టు 17న ముగుస్తుంది. త్రయంబకేశ్వర్‌లోని గోదావరి నది ఒడ్డున మేళా జరగనున్నది. ఉజ్జయినిలో 12 ఏండ్లకోసారి శిప్రా నది ఒడ్డున సింహస్థ కుంభమేళా నిర్వహిస్తారు. ఇది 2028లో జరగనున్నది. 2030లో ప్రయాగ్‌రాజ్
అర్ధ కుంభమేళాను నిర్వహించనుంది.