పీఆర్సీ బకాయిలను ఒకేసారి చెల్లించాలె

పీఆర్సీ బకాయిలను ఒకేసారి చెల్లించాలె

వేతన సవరణను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అమలు చేయకపోవడం వల్ల టీచర్లు, ఉద్యోగులకు ఆర్థికంగా భారీ నష్టం జరుగుతోంది. 2021 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ నగదు చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కానీ 2021 జూన్ నుంచి మాత్రమే పెరిగిన వేతనాలను చెల్లిస్తోంది. అయితే 2021 ఏప్రిల్, మే(రెండు నెలల) బకాయిలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేస్తామని ప్రభుత్వం పీఆర్సీ జీవోలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వచ్చే నెలతో ముగుస్తుండడంతో ప్రభుత్వం పాత నిర్ణయాన్ని మార్చుకుని బకాయిలను వచ్చే ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్ 2022) నుంచి 18 సమాన వాయిదాల్లో 18 నెలలు చెల్లిస్తామని తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం టీచర్లు, ఉద్యోగులకు 2018 జులై నుంచి ఇవ్వాల్సిన పీఆర్సీని 2018 జులై నుంచి 2020 మార్చి వరకు 21 నెలలపాటు నోషనల్ గా ప్రకటించడం వలన ఒక్కో ఉద్యోగి సుమారు రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వేతనాన్ని కోల్పోయాడు. 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు సంవత్సరం పాటు బకాయిలను రిటైర్మెంట్ తర్వాత చెల్లిస్తామని గతంలో జీవో జారీ చేయడం వల్ల కూడా ఉద్యోగులు ఎవరికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం సమకూరలేదు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ బకాయిలను నగదు రూపంలో ఒకేసారి చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత ఇస్తామన్న పీఆర్సీ ఏరియర్స్ జీపీఎఫ్ లో లేదా సీపీఎస్ లో జమ చేసేలా చూడాలి. ప్రభుత్వం సకాలంలో వేతన సవరణ సంఘాలను నియమించి ఉద్యోగులు, టీచర్ల ఆర్థిక
ప్రయోజనాలను కాపాడాలి.
- పిన్నింటి బాలాజీరావు, వరంగల్ జిల్లా