- ఇయ్యాల బుద్ధ పౌర్ణమి
‘‘కోరికలే అన్ని దుఃఖాలకు కారణం”అని ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పిన జ్ఞాని బుద్ధుడు. సత్యం, అహింస, ధర్మం, దయ మనుషుల్లో ఉండాలి అని చెప్పి, బౌద్ధమతాన్ని స్థాపించి ఆ మార్గాన్నే ఆయన ఆచరించి చూపించాడు. ప్రజలు దైవంగా కొలిచే బుద్ధుడు వైశాఖ పౌర్ణమి రోజున జన్మించాడు. మనదేశంలో పలు ప్రాంతాల్లో బుద్ధుని బోధనలు, సందేశాలను స్మరిస్తూ ఈ రోజున ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటారు. బుద్ధుని పూర్వ జన్మలు సుమారు 550 ఉంటే వాటిలో ముఖ్యమైన శరభంగ జ్యోతిపాలుడు తెలంగాణలోని బాదనకుర్తిలో జీవించాడన్న ఆనవాళ్లు ఉన్నాయి. ఎన్నో విద్యలు తెలిసినవాడు కావడంతో జ్యోతిపాలుని వద్దకు రాజులు, వేలాది ప్రజలు వచ్చి తమ పూర్వజన్మ విశేషాలను తెలుసుకునేవారని బౌద్ధ జాతక కథలైన శరభంగ జాతకం, ఇంద్రియ జాతకం తెలుపుతున్నాయి.
బుద్ధ జయంతి సందర్భంగా బౌద్ధమత తొలి బీజాలకు నెలవైనటువంటి బాదనకుర్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నేటి సమాజంపై ఉంది. గోదావరి నది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దాటి తడపాకల మీదుగా పదుల కిలోమీటర్ల దూరం ప్రవహించి ‘మొగలిపేట గంగ’ దగ్గర జగిత్యాల జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ గోదావరి ఉత్తరాభిముఖియై రెండు పాయలుగా చీలి అతి పెద్ద నదీ ద్వీపాన్ని ఏర్పరిచింది.
ఈ నదీ ద్వీపం పేరు బాదనకుర్తి. దీని పొడవు సుమారు15 కిలోమీటర్లు. బాదనకుర్తి మీది వైపు జగిత్యాల జిల్లాలోని వేంపల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో సప్తగోదావరి ఉంది. కుతూహలుడు అనే కవి తన కావ్యం ‘లీలావతి’లో వర్ణించిన ప్రకారం .. ఈ సప్తగోదావరి ఒడ్డునే ఉన్న భీమేశ్వరాలయం ముందరే రెండు వేల సంవత్సరాల క్రితం శాతవాహన రాజు హాలుడు ఇక్కడి ద్వీప రాజును చంపి, ఆయన కూతురు లీలావతిని పెళ్ళి చేసుకుని ఇక్కడి నుంచి గోదావరి ఒడ్డునే మహారాష్ట్రలో ఉన్న తన రాజధాని వెళ్లాడని అర్థమవుతుంది.
బాదనకుర్తి నుంచే బౌద్ధం మనుగడ..
రెండున్నర వేల ఏండ్ల నాటి బౌద్ధ గ్రంథమైన ‘సుత్తనిపాత’కు క్రీ.శ. 4వ శతాబ్దంలో బుద్ధ ఘోషుడు రాసిన వ్యాఖ్యాన గ్రంథంలో ‘పరమార్థజ్యోతిక’లో బావరి, బుద్ధుని పూర్వ జన్మ బోధిసత్వ శరభంగ జ్యోతిపాలుడు కవిటవనం(వెలగతోట) అనే ఈ అంతర ద్వీపం మీద నివసించేవారని ప్రస్తావించాడు. అప్పుడు దీన్ని అంధకరట్ట అని పిలిచేవారని, ఇది దండకారణ్యంలో భాగంగా ఉండేదని ఆయన రచన వల్ల తెలిసింది. ‘వెలగ’ పేరుతో ఈ దీవి చుట్టు పక్కల చాలా గ్రామాలున్నాయి. గోదావరికి ఇరువైపులా ఉన్న ఆ గ్రామాల పేర్లు వలిగొండ, వెలగనూరు, వెలుగుమెట్ల, వెల్గటూరు మొదలైనవి. బావరి పేరుతో బావపూరు కుర్దు, బాదనకుర్తి, బాదనపల్లి మొదలైన ఊర్లున్నాయి. శరభంగుని పేరుతో సారంగపూర్ అని గోదావరికి ఇరువైపులా రెండు గ్రామాలున్నాయి.
బావరి శిష్యుల పేరు మీద కూడా గోదావరి తీరాన గ్రామాలు వెలిశాయి. అలా మోఘరాయ పేరు మీద మొగిలిపేట, మొఖ్ఖట్రావు పేట, కప్పడి పేరు మీద కప్పట్రావుపేట, పోసాల పేరు మీద పొలాస మొదలైన గ్రామాలేర్పడ్డాయి. ఆంధ్రలోని మొగల్రాజపురం బౌద్ధ గుహలు కూడా మోఘరాజు పేరు స్ఫూర్తితో ఏర్పడినవే అనవచ్చు. ఎందుకంటే, బుద్ధుడి వద్దకు బావరి పంపిన 16 మంది శిష్యులకు బుద్ధుడే స్వయంగా తన మతాన్ని ఆవలి తీరాలకు తీసుకెళ్ళమని చెప్పినట్లు ‘సుత్తనిపాత’ ద్వారా తెలుస్తోంది. అలా బౌద్ధ మతం ఈ బాదనకుర్తి నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర దక్షిణాది రాష్ట్రాలకు చేరుకుంది. ఇందుకు నిదర్శనంగా బౌద్ధ జాతక కథలైన ఇంద్రియ జాతకం, శరభంగ జాతకం ఈ బాదనకుర్తి ద్వీపం మీదనే తొలినాళ్ళ బౌద్ధ మతం, థేరవాద బౌద్ధం, అంధక బౌద్ధ సంఘం మనుగడ సాగించాయని పేర్కొనడాన్ని చూపవచ్చు.
బావరికి బౌద్ధ బోధ..
గౌతమ బుద్ధుని కంటే 40 సంవత్సరాలు పెద్దవాడైన బావరి ఈ ప్రాంతంలో 500 మంది శిష్యులకు మూడు వేదాలు, ఇతిహాసాలు, నిఘంటువులు, లక్షణ శాస్త్రాలు, కెటుభాలు (కర్మకాండ క్రతు శాస్త్రాలు) బోధించేవాడు-. 2550 ఏండ్ల క్రితమే 120 ఏండ్లు వయసు వచ్చినా విజ్ఞాన ఆర్జన మీద మోజు తీరక బుద్దుని గురించి అత్త కామినీ అనే స్థానిక దేవత ద్వారా విని ఆయన దగ్గరకు క్రీ.పూ. 483లో 16 మంది శిష్యులను వారి శిష్య సమూహాలతో సహా పంపాడు.
వారిలో పింగియ అనే శిష్యుడు తిరిగి వచ్చి తనకు బుద్ధుడు బోధించిన ధర్మాన్ని బావరికి చెప్తుండగా బుద్ధుడు వెలుగు రూపంలో కనిపించి, ఇరువురికీ ‘మృత్యు రాజ్యం ఆవలి పారం చేరెదరు గాక’ అని చెప్పాడు. ఇది జరిగి ఇప్పటికి 2509 సంవత్సరాలు. ఆ తరువాత బౌద్ధం గోదావరి ఆవలి తీరం... అంటే గోదావరికి దక్షిణంగా ప్రచారమైంది. ఎక్కడైతే బావరికి ఈ బౌద్ధ బోధ జరిగిందో ఆ గ్రామాన్ని ఇప్పటికీ ‘బావపూర్ కుర్దు’ అంటున్నారు. కుర్దు లేదా కుద్దు అంటే నిజమైనది అని అర్థం. నిజంగా కూడా గోదావరి ఇక్కడి నుండే దక్షిణ దిశగా పారుతుంది.
భావితరాలకు స్ఫూర్తి ఉండాలంటే..
బావపూరు కుర్దులో బుద్ధుడు, బావరి, పింగియ, శరభంగ జ్యోతిపాలుడి స్మారక స్థూపాలు కట్టిస్తే భావితరాలకు స్ఫూర్తిగా ఉంటుంది. బుద్ధుని మరణం తర్వాతే బాదనకుర్తిలో ఆయన ధాతువుల మీద స్థూపం కట్టించినట్లు కొన్ని ఆధారాలు తెలుపుతున్నాయి. ఇక్కడ దత్తాత్రేయ మందిరం ముందర ధ్వజ స్తంభం ప్రతిష్ట కోసం తవ్వుతున్నప్పుడు స్థూపం ఆనవాళ్లు బయట పడ్డాయి.
ఇక్కడ ప్రాచీన కాలపు జలదుర్గం ఆనవాళ్లు కూడా ఉన్నాయని, దాని విశాల గోడలున్న ప్రాంతాన్ని 'గోడలపనుపు' అని పిలుస్తున్నారని తెలుస్తోంది. ఇవిగాక పెద్ద దిగుడు బావి, బ్రాహ్మీ శాసనం తదితర ఆధారాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం పరిశోధనలు చేయించాలి.రెండు పాయల గోదావరి బావపూర్ కుర్దు వద్ద మామూలు గోదావరిగా మారి వలిగొండ తరువాత కొన్ని కిలో మీటర్ల దూరంలో కడెం నదిని కలుపుకొని, మరి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న బాదనపల్లి దాటి దక్షిణాభిముఖంగా... దక్షిణ గంగగా ధర్మపురి చేరుకుంటుంది. -డా.ద్యావనపల్లి సత్యనారాయణ, చరిత్ర పరిశోధకుడు