స్టూడెంట్ ఖాతాలోకే ఎస్సీ ప్రీమెట్రిక్ స్కాలర్​షిప్

 స్టూడెంట్ ఖాతాలోకే ఎస్సీ ప్రీమెట్రిక్ స్కాలర్​షిప్
  • డీబీటీ పద్ధతిలో అమౌంట్ బదిలీ
  • 60 వేల మంది 9, 10వ విద్యార్థులకు ఏడాదికి రూ.3 వేలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వెనుకబడిన ఎస్సీ స్టూడెంట్లకు రెండు కేటగిరీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్ ఇప్పటి నుంచి నేరుగా స్టూడెంట్ ఖాతా లేదా వాళ్ల తల్లిదండ్రుల ఖాతాలో పడనుంది. డైరెక్ట్ బెనిఫిట్‌‌ ట్రాన్స్ ఫర్  (డీబీటీ) పద్ధతిలో నగదు బదిలీ కానుంది. ఈ అంశంపై ఇటీవల ఎస్సీ డెవలప్‌‌మెంట్ ప్రిన్సిపల్  సెక్రటరీ శ్రీధర్ జీవో జారీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో  9, 10వ తరగతి చదువుతున్న స్టూడెంట్లకు ఈ స్కాలర్‌‌‌‌షిప్  అందించనున్నారు. 

డే స్కాలర్లకు ఏడాదికి రూ.3500 చొప్పున, హాస్టల్స్ లో ఉండే వారికి ఏడాదికి  రూ.7 వేలు చెల్లించనున్నారు.  రెండో కేటగిరీలో  మురికివాడల్లో నివసించే పిల్లలు, కార్మికులుగా, చెత్త సేకరించే పనిచేస్తున్న తల్లిదండ్రుల పిల్లలకు (ఒకటి నుంచి 10 వ తరగతి వరకు) ఏడాదికి రూ. 3500, హాస్టల్స్ లో ఉండే మూడు నుంచి పదో తరగతి వరకు చదివే వారికి ఏడాదికి రూ. 8 వేలు చెల్లించనున్నారు. కాగా.. రాష్ట్రంలో 60 వేల మంది 9, 10వ తరగతి చదువుతున్న ఎస్సీ స్టూడెంట్లు ఉన్నారని అధికారులు తెలిపారు. స్కాలర్ షిప్ లో  కేంద్రం 60% , రాష్ట్రం 40% వాటా చెల్లిస్తున్నాయి.

రిజిస్ట్రేషన్లు షురూ 

ఈ స్కాలర్ షిప్ కు సంబంధించి రిజిస్ట్రేషన్లు స్టార్ట్  అయ్యాయని, వచ్చే నెల నుంచి నగదు బదిలీ చేస్తామని అధికారులు తెలిపారు. ఆధార్, క్యాస్ట్  సర్టిఫికెట్ తో ఆధార్  లింక్ ఉన్న బ్యాంకు ఖాతా, తల్లదండ్రుల వివరాలు, ఆధార్ నంబర్, ఫొటోతో epass.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రీ మెట్రిక్  స్కాలర్ షిప్  ఆప్షన్ క్లిక్ చేసి అప్లై చేసుకోవాలని సూచించారు.