నార్నే నితిన్, నయన్ సారిక జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మించిన చిత్రం ‘ఆయ్’. అంజి కే మణిపుత్ర దర్శకుడు. గురువారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో నిఖిల్, హీరోయిన్ శ్రీలీల ముఖ్య అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘నితిన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నయన్ సారిక చాలా బాగా నటించింది. వీళ్లలో ఇంత మంచి నటులున్నారా అనేంతలా కసిరాజు, అంకిత్ నటించారు. అంజి అద్భుతంగా తీశాడు.
సినిమా చూస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేసి, ఓ ఎమోషన్‌తో ప్రేక్షకులు బయటకు వస్తారు’ అని చెప్పారు. ‘కులాలు, మతాలను మించిందే స్నేహం అనే మంచి సందేశాన్ని ఇచ్చాం’ అని హీరో నార్నే నితిన్ అన్నాడు. ‘ఈ కథ విన్నప్పుడు ‘జాతిరత్నాలు’ గుర్తొచ్చింది. జాతి రత్నాలు, మ్యాడ్ లేకపోయి ఉంటే ఈ కథను ఇలా తీసే వాళ్లం కాదు’ అని నిర్మాత బన్నీ వాస్ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మాకు పైసా వసూల్.. ప్రేక్షకులకు నవ్వుల వసూల్. రెండు గంటల పాటు అన్నీ మర్చిపోయి నవ్వుతూనే ఉంటారు. కంటతడితో థియేటర్ నుంచి బయటకు వస్తారు’ అని చెప్పాడు. నటుడు అంకిత్ కొయ్య, దర్శకులు అనుదీప్, సాయి రాజేష్, నిర్మాత ఎస్‌కేఎన్, కో ప్రొడ్యూసర్స్ భాను, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.