వానాకాలం వ్యాధులతో జర భద్రం

వానాకాలం వ్యాధులతో జర భద్రం

సమాజంలో 80 శాతం వ్యాధులు ప్రబలటానికి  ప్రధాన కారణాలు.. పారిశుద్ధ్య లోపం, కలుషిత నీరు, పౌష్టికాహారం తీసుకోకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం.  రోగం వచ్చిన తర్వాత ఇబ్బందులు పడేకన్నా అంటురోగాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఉత్తమం.  వర్షాకాలంలో వ్యాపించే కాలానుగుణ (సీజనల్) అంటువ్యాధుల గురించి అవగాహన పెంచుకుని,  నివారణ చర్యలు తీసుకుని మన ఆరోగ్యం  కాపాడుకోవాలి.

వర్షాకాలంలో నీటి ద్వారా వ్యాపించే అంటువ్యాధులలో  నీళ్ల విరేచనాలు (డయేరియా), రక్త విరేచనాలు (అమీబియాసిస్) అతిసారం (గ్యాస్ట్రో ఎంటరైటీస్), కలరా, టైఫాయిడ్, పచ్చ కామెర్లు (జాండిస్), హెపటైటిస్ ప్రధానంగా ఉన్నాయి. అదేవిధంగా వానాకాలంలో గాలి ద్వారా వ్యాపించే అంటువ్యాధుల్లో  జలుబు, దగ్గు, ఫ్లూ, తట్టు, కంఠసర్పి, చికెన్ పాక్స్, టీబీ.  ఇక దోమల ద్వారా వచ్చే అంటు వ్యాధులు.. మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, మెదడు వాపు, జికా వైరస్ జ్వరాలు.


సాధారణంగా రోటా వైరస్ అనే వ్యాధికారక క్రిమి వల్ల నీళ్ల విరేచనాలు వస్తాయి.  కలుషితమైన నీరు, ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. తరచుగా విరేచనాలు, కడుపు నొప్పి, దాహం, నోరు ఎండిపోవడం, చర్మం సాగే గుణం కోల్పోవడం, మూత్రవిసర్జన తగ్గిపోవడం మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు.  నీళ్ల విరేచనాల నివారణకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పప్పు మీది తేట, ఇతర ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇవ్వాలి. దగ్గరలోని ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రం లేదా ఆరోగ్య కేంద్రానికి వెళ్ళినట్లయితే ఓ.ఆర్.ఎస్. ద్రావణం, జింక్ టాబ్లెట్స్,  ఐవి ఫ్లూయిడ్ లతో చికిత్స చేస్తారు. 

అతిసార వ్యాధి: వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి, దాహం, నోరు ఎండిపోవడం, చర్మం సాగే గుణం కోల్పోవుట, మూత్రవిసర్జన తగ్గిపోవుట మొదలైనవి అతిసార వ్యాధి లక్షణాలు. కలుషితమైన నీరు తాగడం, కలుషితమైన లేదా నిలువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం, పరిసరాలు,  వ్యక్తిగత పారిశుద్ధ్యం లోపం వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది. మన రాష్ట్రంలో చిన్నపిల్లల్లో వచ్చే అంటువ్యాధుల్లో దాదాపు 60 నుంచి 70 శాతం కేవలం డయేరియా /అతిసారం ఆక్రమిస్తోంది.  దీనివల్ల 23 శాతం చిన్నారుల మరణాలు సంభవిస్తున్నాయి. అతిసార వ్యాధి నివారణ కోసం  క్లోరినేషన్ చేసిన సురక్షిత నీటిని తాగాలి. ముఖ్యంగా వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటిని తాగాలి. 

ఓఆర్ఎస్ ప్యాకెట్లు నిల్వ ఉంచుకోవాలి. 

టైఫాయిడ్: సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. వారం పది రోజుల పాటు అధిక జ్వరం, విరేచనాలు, పొత్తి కడుపులో నొప్పిగా ఉండటం, కొందరికి శరీరంపై గులాబీ రంగులో చెమటకాయలు మాదిరి దద్దుర్లు మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు.  కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. రక్త పరీక్షల ద్వారా ఈ వ్యాధిని గుర్తించి యాంటీ బయాటిక్ తో తగిన చికిత్స చేస్తారు. 

పచ్చకామెర్లు (జాండిస్): హెపటైటిస్ అనే వైరస్ ద్వారా వ్యాధి వస్తుంది. జ్వరం, ఆకలి లేకపోవుట, కళ్లు, చర్మం, పసుపు పచ్చగా మారడం ఈ వ్యాధి లక్షణాలు. హెపటైటిస్-ఏ ఈ వైరస్ కలిగిన రోగి ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది. నివారణ చర్యల్లో భాగంగా  వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. సురక్షిత నీటిని తాగాలి. 

మలేరియా: మనుషుల్ని కుట్టేది ఆడ దోమలు మాత్రమే. ఆడదోమ గుడ్డు పెట్టాలంటే రక్తంలోని ప్రోటీన్ అవసరం అందుకే అది మనుషులు, పశువులు, పక్షులను కుట్టి రక్తాన్ని పీలుస్తుంది. దోమ రక్తాన్ని పీల్చే ముందు మానవ శరీరంలోకి సూక్ష్మక్రిములను ప్రవేశపెట్టి అంటువ్యాధులకు వాహకంగా పనిచేస్తుంది. ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్, ప్లాస్మోడియం వైవాక్స్ రకానికి చెందిన రెండు రకాల క్రిముల వల్ల మన ప్రాంతాల్లో మలేరియా వస్తుంది.

ఆడఎనాఫిలిస్ దోమకాటు వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది. చలి, వణుకుతో కూడిన జ్వరం, చెమటలు పట్టడం మరియు రోజు విడిచి రోజు జ్వరం రావటం ఈ వ్యాధి లక్షణాలు. మలేరియా జ్వరం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్త పరీక్ష చేయించుకొని నిర్ధారణ తర్వాత మలేరియా రకాన్ని బట్టి పూర్తి మోతాదులో చికిత్స పొందాలి.

డెంగ్యూ: అకస్మాత్తుగా వచ్చే ఎముకలు, కండరాలు, కీళ్ల నొప్పులతో కూడిన తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, శరీరంపై చిన్నపాటి దద్దుర్లు (తీవ్రమైన కేసుల్లో) రావడం డెంగ్యూ జ్వరం లక్షణాలు. చిగుళ్లు, ముక్కు, మలం నుంచి రక్తం పోవడం డెంగ్యూ హెమరేజిక్ లక్షణాలు. అయితే డెంగ్యూ వైరస్ సోకిన అందరికీ వ్యాధి రాదు. ఏడీస్ ఈజిప్ట్​దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి డెంగ్యూ వైరస్ (ప్లావి వైరస్) వల్ల వస్తుంది. ఈ వ్యాధికి లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స చేస్తారు. 

బోధవ్యాధి (ఫైలేరియా, ఎలిఫెంటియాసిస్): తరచూ వచ్చే జ్వరం, చంకల్లో గజ్జల్లో బిళ్లలు కట్టడం, కాళ్లుచేతులు, స్తనాలు, ముష్కం మొదలైన అవయవాలు బాగా వాపు రావడం (వరిబీజం) మొదలైన లక్షణాలు ఉంటాయి. కూలెక్స్ దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి "ఉకలేరియా బ్రాంక్రాఫ్ట్" అనే హెల్మింథిస్ పరాన్న జీవి వల్ల వస్తుంది. వ్యాధికారక క్రిములు శరీరంలో ప్రవేశించిన కొన్ని ఏళ్లకు ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
 
 ఏడాదికి ఒక మోతాదు 

డి.ఇ.సి., ఆల్బెండజోల్ మాత్రలు మింగడం వల్ల వ్యాధిని నివారించవచ్చు.
చికున్ గున్యా: ఏడిస్ దోమకాటు వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అకస్మాత్తుగా వచ్చే జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ప్రత్యేకించి  చిన్న చిన్న కీళ్ల దగ్గర నొప్పి ఎక్కువగా బాధిస్తుంది. లక్షణాలను బట్టి చికిత్స నిర్వహిస్తారు.

జికా వైరస్ వ్యాధి: ఈ వైరస్ సోకిన వారికి జ్వరం,తలనొప్పి, ఒంటి మీద దద్దుర్లు, కండ్లు ఎర్రబారడం వంటి సాధారణ లక్షణాలుంటాయి. ఒక్కోసారి రోగికి మెదడు కుంచించుకు పోయే (గులియన్ బ్యారీ సిండ్రోమ్) మైక్రో సెఫాలి వంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. ఏడిస్ ఈజిప్ట్​ దోమకాటుతో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. జికా ఫీవర్ కు నిర్దిష్ట చికిత్స లేదు.

మెదడువాపు జ్వరం: హఠాత్తుగా వచ్చే విపరీతమైన జ్వరంతో కూడిన ఈ వ్యాధి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో మరణాలు సంభవించడం లేదా అంగవైకల్యం కలగడం జరుగుతుంది. మురికి నీటి నిల్వల్లో పెరిగే క్యూలెక్స్ రకానికి చెందిన దోమల ద్వారా 'జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్' ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

ఈ వ్యాధిని చికిత్స ద్వారా నియంత్రించటం కష్టం.  ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడమే సరైన మార్గం. పందులను, కొంగలను నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. వ్యాధిగ్రస్తులను గుర్తించి సత్వర వైద్య సేవలు అందించాలి. రెండేండ్లలోపు పిల్లలకు జే.ఈ. టీకా రెండు డోసులు ఇప్పించాలి. 

వానాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

కాచి చల్లార్చిన నీటిని తాగాలి.  వేడిగా ఉన్న ఆహారం తినవలెను. ఏరోజు ఆహారము అదే రోజు తినాలి. ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా మూతలను ఉంచాలి. కలుషితమైన నీటిని, ఆహారాన్ని తీసుకోకూడదు.  తాగునీటి పాత్రలపై మూతలుంచాలి. ఆకు కూరలు, కూరగాయలను నీటిలో ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఆహారం తినేముందు చేతులు సబ్బునీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ సీజన్లో బయట చిరు తిండిని, నిల్వ ఉన్న మాంసాహారాన్ని, మిగులు ఆహారాన్ని ఎట్టి పరిస్థితిలో తినకూడదు.

ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా, చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. పల్లపు ప్రాంతాలు, గుంతలను పూడ్చాలి.  నీరు నిల్వ ఉన్న మురికి గుంటలో కిరోసిన్​ గాని, వాడిన ఇంజిన్ ఆయిల్ గానీ మురికి నీటిలో వేస్తే  దోమల పెరుగుదలను అరికట్టవచ్చు. ఇంటి పరిసరాలోని పనికిరాని కుండలు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ గ్లాసులు, పాత టైర్లు, కూలర్లు పూల కుండీలు, ఇంటి పై కప్పున నీరు నిలువ లేకుండా చర్యలు తీసుకోవాలి. ప్రతి శుక్రవారం నీరు నిల్వ ఉండే ఆన్ని పాత్రలను ఖాళీ చేసి, ఆరబెట్టి మరల శుభ్రమైన నీరు నింపాలి. ( ఫ్రైడే  డ్రైడే విధానం) దీనివల్ల కూడా దోమల పెరుగుదలను అరికట్టవచ్చు.

- నాశబోయిన నరసింహ, 
ఆరోగ్య విస్తరణ అధికారి