పెరుగుతున్న వడగాడ్పులు.. కార్యాచరణ ఏది? : దొంతి నర్సింహారెడ్డి

పెరుగుతున్న వడగాడ్పులు.. కార్యాచరణ ఏది? : దొంతి నర్సింహారెడ్డి

వడగాడ్పులు చాలా సమస్యాత్మక వాతావరణ పరిణామం. నిశ్శబ్దంగా, కనిపించకుండా ఉంటుంది. భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో గణనీయంగా వడగాడ్పుల సందర్భాలు తీవ్రమైతున్న పరిస్థితిని సూచిస్తున్నాయి. మానవ సాధారణ మనుగడకు సవాలుగా పరిణమిస్తున్నాయి హీట్ వేవ్స్​. తీవ్రమైన వడగాడ్పులు పెరుగుతూ, మానవ ఆరోగ్యం మీద పెను ప్రభావం చూపుతున్నాయి. ఈ సంవత్సరం మార్చి, మే మధ్య దాదాపు దేశమంతటా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని వాతావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకారం జూన్ 2023 నుంచి  ప్రతి నెలా కొత్త ఉష్ణోగ్రత రికార్డు నమోదు అయ్యింది. 2023 అత్యంత వేడి సంవత్సరంగా  మారింది. ఎల్​నినో (వాతావరణ ద్రోణి) బలహీనమైనప్పటికీ, ఇప్పటికీ కొనసాగుతున్నది. గత సంవత్సర కాలంగా మహాసముద్రాలలో సాధారణం కంటే ఎక్కువ సముద్ర- ఉపరితల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రానున్న మూడు నెలల్లో అంతటా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలకు  దారితీస్తాయని,  ప్రాంతీయ వర్షపాతాన్ని ప్రభావితం చేస్తుందని అంచనా. తెలంగాణలో ఈ నెల మార్చి నుంచి అక్టోబర్ వరకు ఉష్ణోగ్రత 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చు అంటున్నారు. 

తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ఇప్పటికే తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా, మార్చి మొదటి వారంలో, ఉష్ణోగ్రతలు 37డిగ్రీల సెల్సియస్​ కంటే ఎక్కువగా ఉండటంతో, పైన పేర్కొన్న అంచనాలు నిజమే అనిపిస్తున్నాయి. సుదీర్ఘమైన, కష్టతరమైన వేసవి కాలం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మే నెలాఖరు వరకు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు మరింత వేడిగా మారతాయని తెలంగాణ స్టేట్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. 

ఈ వారం చివరి నాటికి దాదాపు 40-, 41 డిగ్రీల సెల్సియస్​ వరకు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వారు అంచనా వేస్తున్నారు. పగటిపూట విపరీతమైన వేడి వల్ల హైదరాబాద్  ప్రాంతంతో సహా చాలా చోట్ల ఉరుములతో కూడిన గాలివానలు రావచ్చు. వడగాడ్పులు ఎక్కువ కావచ్చు. ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, వేడి వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఆదాయం తగ్గుతుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి.

అభాగ్యుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి

చలి ఎక్కువ అయితే దుప్పట్లు, రగ్గులు కప్పుకోవచ్చు. చలి మంట పెట్టుకోవచ్చు. వేడి ఎక్కువ అయితే ఎక్కడికి పోతే  తగ్గుతుంది?  దేని వలన వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు? ఏసీ పెట్టుకునే స్తోమత ఉన్న ఇండ్లు చాలా తక్కువ. ఏసీ కార్లలో ప్రయణించగలిగే వ్యక్తులు ఇంకా తక్కువ. విపరీతమైన ఎండ ఉన్నా పని చేయాల్సిన వృత్తులు అనేకం. వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ  కార్మికులు, వీధి వ్యాపారులు,  డ్రైవర్లు తదితరులు తమ వృత్తి కొనసాగాల్సిందే. ఎండ వేడి తీవ్రంగా ఉండే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు పని చేయాల్సిన జనాభా సంఖ్య ఎంత? వీరికి వేడి,  ఉక్కపోత నుంచి, ఉష్ణోగ్రత నుంచి ఉపశమనం పొందే అవకాశాలు చాలా తక్కువ. వేడి వాతావరణంలో  నీరు, నీటి లభ్యత, నీడ చాలా ముఖ్యం. అది దొరకని అభాగ్యుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. 

నామమాత్రంగా హెచ్​ఏపీలు

ఎండాకాలం విధిగా నీటి లభ్యత పెంచడానికి, నీడ పెంచడానికి, వివిధ వృత్తుల వారికి వేడి నుంచి ఉపశమనానికి ప్రభుత్వ చర్యలు ఉండాలి. అవి తీసుకోలేదు.  తెలంగాణ ప్రభుత్వంతో సహా  భారతదేశం అంతటా రాష్ట్ర, జిల్లా, పురపాలక స్థాయిలలో ప్రభుత్వాలు కోర్టు ఆదేశాల మేరకే స్పందించాయి. వివిధ రకాల కార్యకలాపాలను సూచించే‘ హీట్​వేవ్​ యాక్షన్ ప్లాన్‌‌‌‌‌‌‌‌ ’(హెచ్​ఏపీ)లను రూపొందించడం ద్వారా తమ పని అయిపోయినట్లు చేతులు దులుపుకున్నాయి. ఇవి ఎక్కువ శాతం అవగాహన కార్యక్రమాలకు, వాణిజ్య ప్రకటనలకు, గ్లూకోజు తాగండి, ఇంట్లోనే ఉండండి, నీళ్ళు తాగండి తరహా సూచనలకు పరిమితం అయినాయి. చాలా హెచ్ఏపీలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తయారు చేయలేదు. ప్రమాద తీవ్రతను, విస్తృతిని గుర్తించలేదు. సంస్థాగతంగా చర్యలను విభజించలేదు. వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతగా మాత్రమే భావిస్తున్నారు.
 

తగిన నిధులు కేటాయింపులేదుదేశంలో తయారు అయిన కార్యాచరణ ప్రణాళికలలో 37 హెచ్​ఏపీలను ఒక ఢిల్లీ సంస్థ అధ్యయనం చేసింది.  వారి పరిశీలన ప్రకారం దాదాపు అన్ని హెచ్​ఏపీలు వేడి బారిన పడే వ్యక్తులు, వృత్తులు, వర్గాలను, ప్రాంతాలను గుర్తించడంలో విఫలం అయ్యాయి. ప్రణాళికలలో పేలవమైన లక్ష్యాలు  ఉన్నాయి. హెచ్​ఏపీలకు తగినన్ని నిధులు కూడాకేటాయించలేదు.  తక్కువగా ఇచ్చారు. హెచ్​ఏపీలకు చట్టబద్ధ పునాదులు బలహీనంగా ఉన్నాయి. అమలులో ఇది ప్రభావం చూపుతుంది. హెచ్​ఏపీలు తగినంత పారదర్శకంగా లేవు. వేడి వలన జరిగే ఉత్పాతాలను ఎదుర్కొనే సామర్థ్యం కార్యక్రమాలు దాదాపు మృగ్యం. వివిధ రంగాల మీద ప్రభావం, తగిన ఉపశమన చర్యలు గుర్తించలేదు. సంపూర్ణ, సమగ్ర వడగాడ్పుల కార్యాచరణ ప్రణాళికలు చాలా అవసరం. సమర్థవంతంగా అమలు చేసే హీట్​వేవ్​ యాక్షన్ ప్లాన్‌‌‌‌‌‌‌‌లు (హెచ్​ఏపీలు) మరణాలను, అనారోగ్యాన్ని తగ్గించగలవు.

హైకోర్టు చెప్పినా తగిన ప్రణాళిక తయారు చేయలేదు

పిట్టల శ్రీశైలం 2015లో తెలంగాణ హైకోర్టులో కేసు వేస్తే కోర్టు ఉత్తర్వుల మేరకు 2016లో తెలంగాణ ప్రభుత్వం వడగాడ్పుల కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. ఇది చాలా బలహీనంగా ఉన్నది. దీనిని సరి చేయాలనీ అనేక సూచనలతో  అప్పటి నుంచి కూడా నేను ప్రతి ఏటా ప్రభుత్వ కార్యదర్శికి, జిల్లా కలెక్టర్లుకు ఉత్తరాలు రాసినా స్పందన లేదు. ఎండాకాలం తెలంగాణలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. అటవీ ప్రాంతంగా చెప్పుకునే ఆదిలాబాదులో కూడా చెట్లు కనుమరుగై, నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. 2016లో ఒక మహిళ తన పిల్లలతో ఒక ఊరు నుంచి ఇంకో ఊరుకు కాలి నడకన బయలుదేరి దాహం తీర్చుకోలేక, నీడ లేక పిల్లలు చనిపోయిన సంఘటన పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. వడగాడ్పుల పట్ల సమాజం, ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నది.

దోసకాయలు, తైదల జావా, తాటి ముంజలు, అంబలి తీసుకోవాలి

తెలంగాణలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం పథకాలను వడగాడ్పుల కార్యాచరణ ప్రణాళికతో జోడించలేదు. పోషకాలతో కూడిన ఆహారం అత్యంత అవసరం. మన రాష్ట్రంలో దోసకాయలు, తైదల జావా, మంచి నీళ్ళు, తాటి ముంజలు తదితర ఆహారం ఆకలితో పాటు, దాహాన్ని తీరుస్తాయి. శరీరానికి అవసరమైన లవణాలు అందిస్తాయి. గ్లుకోజ్​ ప్యాకెట్​ కొని నీళ్ళ కోసం వెతికే బదులు, ఇటువంటి ఆహారం అందిస్తే రెండు సమస్యలకు పరిష్కారం వస్తుంది. అంబలి కేంద్రాలు పెడితే తప్పేమీ లేదు. నీటి కేంద్రాలను ప్రోత్సహించే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అంబలి కేంద్రాలు, దోసకాయల వితరణ కేంద్రాలు పెడితే పేదలకు ఉపయోగపడతాయి. 

నీటి కొరతను అధిగమించాలంటే ప్రభుత్వం ఎండాకాలం నీరు అందించే బోర్లను తన అధీనంలోకి తీసుకుని నీరు అందరికి అందే విధంగా ఏర్పాటు చెయ్యాలి. ఇట్లాంటి అనేక సూచనలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి, జిల్లా కలెక్టర్లకు నేను పంపాను. ఇప్పటికైనా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేడి తరంగాలు ముంచుకురాబోవడం ఆరోగ్య ప్రమాదంగా గుర్తించాలి.  తెలంగాణ ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయి సమీక్ష చేసి, అత్యవసర చర్యలు చేపట్టాలి. మరణాలను  నివారించాలి. వడ దెబ్బ బాధితులకు అండగా నిలవాలి. దీర్ఘకాలిక ప్రణాళికలు తయారు చెయ్యాలి. ఏటా బడ్జెట్లో వడగాడ్పులకు నిధులు కేటాయించాలి.

- డా. దొంతి నర్సింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్​