బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ నవంబర్ 22 నుంచి తొలి టెస్ట్ ఆడనుంది. పెర్త్ వేదికగా జరగనున్న ఈ టెస్ట్ మ్యాచ్ కు భారీ హైప్ నెలకొంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు వెళ్లాలంటే ఈ సిరీస్ ఇరు జట్లకు అత్యంత కీలకం. దీంతో రెండు జట్లు కూడా సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. ఆతిధ్య జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం.
స్వదేశంలో భారత్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ జట్టును ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో 13 మందితో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. అనూహ్యంగా ఆసీస్ జట్టులో ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు.
ఓపెనర్లుగా ఖావాజా, మెక్‌స్వీనే:
ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ మ్యాచ్ లో ఖావాజాతో పాటు యువ ప్లేయర్ మెక్‌స్వీనే ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. దేశవాళీ క్రికెట్ తో పాటు ఇటీవల ఆస్ట్రేలియా-ఏ తరఫున రాణించిన మెక్‌స్వీనే పట్ల ఆస్ట్రేలియా నమ్మకముంచనున్నట్టు సమాచారం. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్,ట్రావిస్ హెడ్ వరుసగా మూడు నాలుగు స్థానాల్లో తమ స్థానాలను నిలుపుకోవడం ఖాయం. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా జట్టులో మిచెల్ మార్ష్ జట్టులో కొనసాగుతాడు.
వికెట్ కీపర్ గా అలెక్స్ కేరీ ఉంటాడు. ఏకైక స్పిన్నర్ గా నాథన్ లైయన్ జట్టులో ఎలాగో ఉంటాడు. ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే మిచెల్ స్టార్క్,జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. స్కాట్ బొలాండ్, జోష్ ఇంగ్లిస్ నిరాశ తప్పకపోవచ్చు.
తొలి టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా):
పాట్ కమిన్స్ (కెప్టెన్), అలెక్స్ కేరీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖావాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనే, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్