ప్రీతి కేసు ఎంక్వైరీ.. తిరిగి.. తిరిగి ఎంజీఎంకు

  • మూడు వారాలుగా ఎటూ తేల్చని వరంగల్‌ పోలీసులు
  •     అనుమానాస్పద మృతి కేసుగా మార్చేందుకు అడుగులు 
  •     ప్రభుత్వం, మంత్రులపై పెరుగుతున్న నిరసన సెగ
  •     మొన్న మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిని అడ్డుకున్న ప్రజా సంఘాలు

వరంగల్/వరంగల్​సిటీ, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్ ధరావత్ ప్రీతి మృతి కేసు విచారణ తిరిగి తిరిగి మళ్లీ ఎంజీఎం హాస్పిటల్​కు చేరింది. ఇష్యూ జరిగి మూడు వారాలైనా యువతి మృతికి అసలు కారణమేంటో పోలీసులు తేల్చలేకపోయారు. దీంతో రోజురోజుకు పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. సీనియర్ సైఫ్ వేధింపులతోనే ప్రీతి సూసైడ్ చేసుకుందని పోలీసులు భావించగా రిపోర్టుల్లో వేరేగా వచ్చింది. పోలీసులకు ఎటుచూసినా కావాల్సిన ఆధారాలు దొరకకపోవడంతో మరోసారి ఎంజీఎం బాట పట్టారు. వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ నేరుగా రంగంలోకి దిగారు. ఆయనే స్వయంగా ఒక్కొక్కళ్లను విచారిస్తున్నారు. కాగా ప్రీతి మృతిని ఎటూ తేల్చకపోవడంతో మంత్రులను ప్రజా సంఘాల నేతలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. జిల్లాల్లో జరుగుతున్న వివిధ కార్యక్రమాల వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు.

ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ధరావత్ ప్రీతి ఫిబ్రవరి 22న ఆత్మహత్య చేసుకున్నట్లు.. దీనంతంటికి సీనియర్ స్టూడెంట్ సైఫ్ కారణమని పోలీసులు చెప్పగా, ప్రీతి తండ్రి మాత్రం తమ కూతురిది మూమ్మాటికీ హత్యే అంటున్నారు. కావాలనే డయాలసిస్ చేసి టాక్సికాలజీ రిపోర్టును తప్పుదారి పట్టించినట్లు ఆరోపించారు. మూడు వారాలుగా రుజువు చేయకపోవడంతో గిరిజన, ప్రజా సంఘాలు, అపొజిషన్ పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బుధవారం వరంగల్​లో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్​ను ప్రజా సంఘాల నాయకులు నిలదీశారు. కేసీఆర్ బిడ్డ లిక్కర్ కేసు గురించి మాట్లాడుతున్న మంత్రులు.. గిరిజన బిడ్డ ప్రీతి కేసును పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం వరంగల్ పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ ప్రీతి కుటుంబ సభ్యులను కలిశారు. కేసును త్వరితగతిన తేల్చుతామని చెప్పి.. అక్కడి నుంచే వరంగల్ సీపీ రంగనాథ్ కు ఫోన్ చేసి మాట్లాడారు.

హాస్పిటల్​ సిబ్బందితో సీపీ సమావేశం?

ప్రజా సంఘాలు, ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి పెరగడంతో సీపీ ఏవీ రంగనాథ్ నేరుగా రంగంలోకి దిగారు. వీలైనంత త్వరగా ఏదో ఒకటి తేల్చాలని చూస్తున్నారు. ఎంజీఎంలో మరోసారి అందరినీ విచారించి ఆధారాలు దొరికితే అసలు కేసు.. లేదంటే అనుమానస్పద మృతిగా మార్చేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం సాయంత్రం రంగనాథ్ ఎంజీఎం వెళ్లారు. ప్రీతి ఘటన జరిగిన రోజు పడిపోయిన గదిని ఓపెన్ చేయించి పరిశీలించారు. సూపరింటెండెంట్ ఆఫీస్ ఎదురుగా ఉండే కాన్ఫరెన్స్ హాల్​లో కూర్చొని ఆ రోజు డ్యూటీలో ఉన్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ డాక్టర్లు, పీజీ హౌస్​సర్జన్లు, హెడ్​నర్సులతో సమావేశమయ్యారు. ఎంజీఎం అధికారులు అనారోగ్య సమస్యలు, కార్డియక్ అరెస్ట్ అని చెబుతున్న నేపథ్యంలో ఆ కోణంలో వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రీతిని ఎంజీఎం నుంచి హైదరాబాద్ తరలించే క్రమంలో బతికే ఉందా అని ప్రశ్నించినట్లు సమాచారం. అధికారులు ఎంతసేపు ప్రీతికి అనారోగ్య సమస్యలే ఉన్నాయని చెప్పినట్లు తెలిసింది. అందువల్లే ఆమె అచేతనంగా ఉన్నది చూసి ట్రీట్​మెంట్ అందించినట్లు చెప్పారని సమాచారం. ఆత్మహత్య, హత్య వాదనలను పక్కనపెట్టి.. పోలీసులు కేసును అనుమానస్పద కేసుగా మార్చాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

టాక్సికాలజీ రిపోర్టుతో సీన్ ​రివర్స్..

మెడికో ప్రీతి మృతిని పోలీసులు మొదటి నుంచి ఆత్మహత్యగానే భావించారు. సీనియర్ పీజీ స్టూడెంట్ సైఫ్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. టెక్నికల్ టీమ్ తో రెండు రోజులు విచారణ చేసి ఆత్మహత్యకు ఆధారాలు ఉన్నాయన్నారు. వాట్సాప్ చాటింగులు, ఫోన్ కాల్ డేటా వివరాలు తెలిపారు. ఎంజీఎంలో ప్రీతి పడిపోయినచోట ‘సక్సీనైల్ కోలిన్’ తదితర మత్తు ఇంజక్షన్లు దొరికినట్లు చెప్పారు. దీనికి సంబంధించి ‘టాక్సికాలజీ రిపోర్టు’లో అన్ని తెలుస్తాయన్నారు. ఫిబ్రవరి 24న సైఫ్​ను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. తీరా చూస్తే టాక్సికాలజీ రిపోర్టులో మత్తు ఇంజక్షన్లకు సంబంధించిన ఆనవాళ్లు లేకపోవడంతో పోలీసులపై విమర్శలు మొదలయ్యాయి.