- ఎడ్ల బండి మీద రెండున్నర కి.మీ. ప్రయాణం
- ఆ తర్వాత 108లో కాగజ్ నగర్ దవాఖానకు తరలింపు
- కండిషన్ సీరియస్ అంటూ మంచిర్యాలకు రిఫర్ చేసిన డాక్టర్లు
- అవస్థ చూడలేక ప్రైవేట్‌లో చేర్పించిన కుటుంబీకులు
- అక్కడ సిజేరియన్ చేసిన డాక్టర్లు.. అప్పటికే చనిపోయిన శిశువు
- కుమ్రం భీమ్ జిల్లా పెంచికల్ పేట్ మండలం మేరుగూడలో ఘటన
కాగజ్ నగర్, వెలుగు: ఊరికి రోడ్డు సౌకర్యం లేక అర్ధరాత్రి నొప్పులు వచ్చిన గర్భిణీ నరకయాతన పడింది. అడివిలో బురద రోడ్డులో, ఎడ్లబండిలో రెండున్నర కిలోమీటర్లు తీసుకెళ్లి అంబులెన్స్ ఎక్కించారు. సర్కార్దవాఖానకు పోతే ఆమె కండిషన్సీరియస్గా ఉందని పెద్దాసుపత్రికి రిఫర్ చేశారు. అప్పటికే గర్భిణి తీవ్ర అవస్థ పడుతుండడంతో కుటుంబ సభ్యులు అక్కడే ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు సిజేరియన్ చేశారు. అయితే అప్పటికే బిడ్డ చనిపోయింది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం మేరుగూడ గ్రామానికి చెందిన దుర్గం పంచపూల నిండు గర్భిణి.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి పంచపూలకు నొప్పులు వచ్చాయి. స్థానికంగా ఎటువంటి వైద్య సౌకర్యం లేకపోవడంతో.. ఆశా వర్కర్ సాయంతో కుటుంబీకులు ఎడ్ల బండిలో ఆమెను సమీపంలోని ఎల్లూర్ గ్రామానికి తీసుకువచ్చారు. ఊరికి రోడ్డు సౌకర్యంలో లేకపోవడంతో అడవి దారిలో బురదలో రెండున్నర కిలోమీటర్లు బండిలో తరలించారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో తెల్లవారుజామున మూడు గంటలకు కాగజ్ నగర్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. గర్భిణి పరిస్థితి విషమంగా ఉందని ఇక్కడ చేర్చుకోలేమని మంచిర్యాల హాస్పిటల్‌కు తీసుకెళ్లాని డాక్టర్లు వారికి చెప్పారు. రాత్రి నుంచి గర్భిణీ పడుతున్న అవస్థ చూడలేక భర్త పొచన్న కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లి చేర్పించారు. అక్కడి డాక్టర్లు పంచపూలకు సిజేరియన్ చేసి అడ శిశువును బయటకు తీశారు. గర్భిణీకి రాత్రి నుంచి రక్తస్రావం కావడంతో పాటు గర్భంలో మలం శిశువు నోట్లోకి చేరి చనిపోయింది.