హైదరాబాద్ లో గర్భిణి భార్యపై భర్త క్రూరదాడి..పలుమార్లు బండరాయితోబాది హత్యాయత్నం

హైదరాబాద్ లో గర్భిణి భార్యపై భర్త క్రూరదాడి..పలుమార్లు బండరాయితోబాది హత్యాయత్నం

 

  • చావుబతుకుల మధ్య బాధితురాలు
  • ఐటీ కారిడార్ లో  నడిరోడ్డుపై దారుణం
  • ఆలస్యంగా వెలుగులోకి.. 

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ లో నడిరోడ్డుపై దారుణం జరిగింది. గర్భిణిగా ఉన్న తన భార్యను దవాఖానకు తీసుకువచ్చిన ఓ భర్త ఆమెతో గొడవపడ్డాడు. కోపంలో బండరాయి తీసుకొని ఆమెపై ఇష్టమొచ్చినట్లు బాదాడు. దాదాపు 10 నుంచి 12 సార్లు బండరాయితో మోదడంతో తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వికారాబాద్ కు చెందిన ఎండీ బస్రత్ (32) బతుకుదెరువు కోసం నగరానికి వలసవవచ్చి కుటుంబంతో కలిసి హఫీజ్ పేటలోని ఆదిత్య నగర్ లో ఉంటున్నాడు.

2023 జనవరిలో అజ్మీర్  దర్గాలో కోల్ కతాకు చెందిన షబానా పర్వీన్ (22) బస్రత్ కు పరిచయమైంది. వారి పరిచయం ప్రేమగా మారింది. 2024 అక్టోబర్​లో  పెండ్లి చేసుకున్నారు. తర్వాత హఫీజ్ పేటలోని ఆదిత్యనగర్ లో కాపురం పెట్టారు. బస్రత్  ఇంటీరియర్ డిజైనర్​గా పని చేస్తున్నాడు. పెండ్లి తర్వాత బస్రత్  కొన్నాళ్లు తన తల్లిదండ్రులతో ఉన్నాడు. కుటుంబంలో కలహాలు రావడంతో బస్రత్, షబానా పర్వీన్  స్థానికంగా వేరు కాపురం పెట్టారు. ప్రస్తుతం షబానా రెండు నెలల గర్భిణి.

గత నెల 29న ఆమెకు వాంతులు కావడంతో కొండాపూర్  రాఘవేంద్ర కాలనీలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించాడు. రెండు రోజులు దవాఖానలో చికిత్స తీసుకున్న తర్వాత పర్వీన్ ను ఈ నెల1న రాత్రి డిశ్చార్జ్  చేశారు. హాస్పిటల్  నుంచి బయటకు వచ్చిన వెంటనే భార్యాభర్తలు ఏదో విషయమై గొడవపడ్డారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో బస్రత్  ఒక్కసారిగా పర్వీన్  మీద దాడికి తెగబడ్డాడు. పెనుగులాటలో కిందపడిన భార్యపై అక్కడే ఉన్న బండరాయితో బస్రత్  విచక్షణారహితంగా దాడి చేశాడు.

10 నుంచి 12సార్లు రాయితో మోదడంతో పర్వీన్  తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఘటనా స్థలం నుంచి బస్రత్  పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా గచ్చిబౌలి పోలీసులు బాధితురాలిని ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు మియాపూర్​లోని ఓ ప్రైవేటు దవాఖానకు, అక్కడి నుంచి నిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం కోమాలో ఉన్న పర్వీస్  చావుబతుకుల మధ్య పోరాడుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు బస్రత్ ను ఈనెల 3న అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.