- న్యాయం చేయాలని డెడ్‌బాడీతో
- కుటుంబసభ్యుల ఆందోళన
- మెదక్ జిల్లా నర్సాపూర్ పద్మజ హాస్పిటల్ సీజ్
నర్సాపూర్, వెలుగు : మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆపరేషన్ సందర్భంగా డాక్టర్ల పొరపాటుతో ఓ గర్భిణి కన్నుమూసింది. గర్భసంచి ఆపరేషన్ కోసం మెదక్ జిల్లా నర్సాపూర్ లోని చైతన్యపురి కాలనీకి చెందిన ఇటుకల ఇంద్ర (40)ను ఈనెల15న పద్మజ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. 16న ఆపరేషన్ చేస్తుండగా అనుకోకుండా పెద్ద పేగు కట్ చేశామని డాక్టర్లు చెప్పారని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో ఇంద్ర చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని కుటుంబసభ్యులు హాస్పిటల్ ఎదుట రాత్రి వరకు ఆందోళన చేశారు.
యాజమాన్యం చర్చలు జరిపి రూ.17 లక్షల నష్ట పరిహారం మూడు విడతలుగా ఇస్తామని రాజీ కుదుర్చుకుంది. తీరా డబ్బుల కోసం వెళ్తే సీసీ ఫుటేజ్ తీసుకొని ఆందోళన చేసిన వారిపై కేసులు పెడతామని మాట్లాడడంతో మళ్లీ శుక్రవారం హాస్పిటల్ ఎదుట మృతదేహంతో ఆందోళన చేశారు. వీరికి మద్దతుగా వివిధ పార్టీల నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. హాస్పిటల్, డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎంహెచ్‌వో హాస్పిటల్‌ను విజిట్ చేసి మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతోపాటు హాస్పిటల్ సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. ఆందోళనలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి రమణారావు, బీజేపీ కౌన్సిలర్ సురేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు చంద్రశేఖర్, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.