
- డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాలింత బంధువుల ఆందోళన
- మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆస్పత్రి పై కేసు, డీఎంహెచ్ ఓ విచారణ
- వరంగల్ సిటీలోని క్యూర్ వెల్ ఆస్పత్రిలో ఘటన
వరంగల్ సిటీ, వెలుగు: డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని ఆరోపిస్తూ బాలింత కుటుంబ సభ్యులు వరంగల్ సిటీలోని క్యూర్ వెల్ ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు వెళ్లి నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగెం మండలం గవిచర్లకు చెందిన జింకల రాజు భార్య ప్రవళిక(25) గర్భిణి అయినప్పటినుంచి క్యూర్ వెల్ ఆస్పత్రిలో హెల్త్ చెకప్ చేయించుకుంటోంది. ఆదివారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు క్యూర్వెల్ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోమవారం ప్రవళికకు డాక్టర్లు సర్జరీ చేసి డెలివరీ చేయగా పాప పుట్టిందని, తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని కుటుంబసభ్యులకు చెప్పారు.
అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రవళికకు తీవ్ర రక్తస్రావం అవుతుందని, బ్లెడ్ తీసుకురావాలని వైద్య సిబ్బంది సూచించారు. వెంటనే రాజు ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ లో నాలుగు యూనిట్ల ఏ పాజిటివ్ బ్లడ్ కొని తీసుకెళ్లి ఇచ్చాడు. రాత్రి 9 గంటల సమయంలో ప్రవళిక కండీషన్ సీరియస్ గా ఉందని వైద్య సిబ్బంది చెప్పి అంబులెన్స్ లో సిటీలోని ఏకశిలా ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్లి సీపీఆర్ చేస్తుండగా ప్రవళిక చనిపోయిందని డాక్టర్లు ఆమె కుటుంబసభ్యులకు చెప్పారు. దీంతో ప్రవళిక మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని భర్త రాజు మట్టవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. బాలింత మృతిపై ఎంక్వైరీ చేయించాలని వరంగల్ డీఎంహెచ్ ఓకు పోలీసులు లెటర్ రాశారు. విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని డీఎంహెచ్ ఓ డాక్టర్సాంబశివరావు తెలిపారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని
చెప్పారు.