
తిర్యాణి, వెలుగు : సరైన టైంలో ట్రీట్మెంట్ అందక నిండు గర్భిణి మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో జరిగింది. తిర్యాణి మెడికల్ ఆఫీసర్ హర్షవర్ధన్, గర్భిణి పేరెంట్స్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పంగిడి మదర పంచాయితీ, మార్కగూడ గ్రామానికి చెందిన ఆత్రం సాక్రుబాయి (32) కి గురువారం పురిటినొప్పులు రావడంతో దగ్గరలోని చెలిమెల గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నార్మల్ డెలివరీ సాధ్యం కాలేదు.
సిజేరియన్ సౌలత్ లేక డాక్టర్లు బెల్లంపల్లికి రెఫర్ చేశారు. పరిస్థితిని పరిశీలించిన బెల్లంపల్లి డాక్టర్లు మంచిర్యాల ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే గర్భిణి మృతి చెందినట్లు మంచిర్యాల డాక్టర్లు నిర్ధారించారు. దగ్గరలోని చెలిమెల గవర్నమెంట్ హాస్పిటల్లో సిజేరియన్ సౌలత్ ఉండి ఉంటే సాక్రుబాయి బతికేదని ఆమె తల్లిదండ్రులు కన్నీంటి పర్యంతమయ్యారు. మృతురాలికి భర్త వినాయక్ రావు, ఇద్దరు సంతానం ఉన్నారు.