జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన మౌనిక (20) అనే గర్భిణి డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. సెప్టెంబర్ 30న జరిగిన ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ స్థానిక ప్రయివేటు ఆసుపత్రి ముందు బంధువుల ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో మౌనిక అనే గర్భిణి జ్వరంతో ఆస్పత్రిలో చేరగా.. ఆమెకు వైద్యులు చికిత్స చేశారు.
అనంతరం ఆమెకు డెంగ్యూ ఉందని వైద్యులు వెల్లడించారు. ప్లేట్ లెట్స్ పడిపోయాయన్న కారణంతో ఆమెకు రక్త కణాలను ఎక్కించి చికిత్స చేశారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బంధువులు నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మౌనిక మరణించినట్లు అక్కడి వైద్యుల ధ్రువీకరించారు. ఈ క్రమంలో మెట్ పెల్లి పట్టణంలోని ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ధర్నాకు దిగారు. న్యాయం చేస్తామని పోలీసుల హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.