అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ప్రాణాలతో బయటపడ్డ నిండు గర్భిణీ

అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ప్రాణాలతో బయటపడ్డ నిండు గర్భిణీ

మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. అంబులెన్స్‌లో గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులు ప్రయాణిస్తుండగా మంటలు చెలరేగాయి. ఆ మంటల వేడికి అందులోని ఆక్సిజన్ సిలిండర్ సైతం పేలిపోయింది. సకాలంలో డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. 

గర్భిణీ, ఆమె కుటుంబాన్ని అంబులెన్స్‌లో ఎరండోల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జల్గావ్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్తున్న సమయంలో  ఈ ప్రమాదం జరిగింది. ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన అంబులెన్స్‌ డ్రైవర్.. వెంటనే వాహనాన్ని ఆపి, అందరినీ దిగిపోవాలని అప్రమత్తంగా కోరాడు. దాంతో, వారు హుటాహుటీన కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. 

Also Read : నాగర్‌‌కర్నూల్‌‌లో నైపుణ్యాభివృద్ధి సెంటర్​ పెట్టండి

గర్భిణి, ఆమె కుటుంబం వాహనం దిగిన క్షణాల వ్యవధిలోనే అంబులెన్స్‌లోని ఆక్సిజన్ సిలిండర్ భారీ శబ్ధంతో పేలింది. ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. చూస్తుండగానే అంబులెన్స్‌ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.