- చనిపోయింది ఆమె భర్త కాదని తర్వాత వెల్లడించిన వైద్యులు
- డెడ్ బాడీ అప్పగింతలో పొరపాటు పడ్డట్లు వివరణ
- ఆస్పత్రి పొరపాటుకు ఓ నిండు ప్రాణం బలి
- ఒడిశా ఆస్పత్రి వర్గాల నిర్వాకం.. మండిపడుతున్న బంధువులు
భువనేశ్వర్ : ఆస్పత్రి ఇచ్చిన తప్పుడు సమాచారం ఓ మహిళ ప్రాణం తీసింది. కాలిన గాయాలతో చనిపోయింది ఒకరైతే మరొకరని పొరబడిన హాస్పిటల్ యాజమాన్యం.. ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించింది. దీంతో వాళ్లు అంత్యక్రియలు నిర్వహించారు. భర్త మృతితో మనోవేదనకు గురైన భార్య ఆ మరుసటి రోజే ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా జరిగిన తర్వాత, చనిపోయింది ఆ మహిళ భర్త కాదని, వేరొకరని ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించడంతో బాధిత కుటుంబం నివ్వెరపోయింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ ఘటన జరిగింది.
భర్త మృతిని తట్టుకోలేక భార్య సూసైడ్
భువనేశ్వర్‌కు చెందిన దిలీప్(34) అనే వ్యక్తి ఎసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. దిలీప్ మరో ముగ్గురు జ్యోతిరంజన్, శ్రీతమ్, సింహాచలంతో కలిసి డిసెంబర్ 29న అదే సిటీలోని హైటెక్ హాస్పిటల్లో ఏసీ రిపేర్‌కు వెళ్లారు. రిపేర్ చేస్తున్న క్రమంలో ఏసీలో పేలుడు సంభంవించడంతో నలుగురికీ తీవ్ర గాయాలయ్యాయి. ట్రీట్మెంట్ అందిస్తుండగా ఈ నలుగురిలో ఒకరు డిసెంబర్ 30న చనిపోయారు. ఆస్పత్రి వర్గాలు మృతుడిని దిలీప్‌గా గుర్తించి, డెడ్‌బాడీని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించాయి. తీవ్ర గాయాల వల్ల మృతదేహం దిలీప్దేనని అనుకున్న అతని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ మరుసటి రోజు దిలీప్ భార్య సోనా(24) ఉరివేసుకుని చనిపోయింది. దీంతో దిలీప్‌ను దహనం చేసిన చోటే సోనా మృతదేహానికి కూడా అంత్యక్రియలు నిర్వహించారు. ఇదంతా జరిగాక, దిలీప్ కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. చనిపోయింది జ్యోతిరంజన్ అని, ఆ డెడ్ బాడీని దిలీప్ గా పొరబడ్డామని చెప్పారు. విషయం తెలిసి జ్యోతిరంజన్ కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. అంత్యక్రియలు చేయకుండా చేశారని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అటు దిలీప్ కుటుంబ సభ్యులు కూడా ఆస్పత్రి వద్ద బైఠాయించారు. ఆస్పత్రి వర్గాల నిర్వాకంతో కోడలు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.