నల్గొండ ప్రభుత్వ దవాఖానలో దారుణం కుర్చీలోనే గర్భిణి డెలివరీ

నల్గొండ ప్రభుత్వ దవాఖానలో దారుణం కుర్చీలోనే గర్భిణి డెలివరీ
  • దేవరకొండ పోతే నల్గొండ పొమ్మన్నరు..అక్కడికి పోతే మళ్లీ దేవరకొండకే వెళ్లమన్నరు 
  • ఎటూ తేల్చుకోలేక నొప్పులతో కుర్చీలో కూలబడిన గర్భిణి,అక్కడే ప్రసవం..
  • పాప కిందపడబోతుండగా పట్టుకున్న కుటుంబీకులు

నల్గొండ అర్బన్, వెలుగు:  నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటుచేసుకుంది. కాన్పు కోసం  నొప్పులతో దవాఖానకు వచ్చిన గర్భిణిని డ్యూటీ డాక్టర్​, నర్సులు వెళ్లిపొమ్మనడంతో కుర్చీలోనే డెలివరీ అయ్యింది. నేరేడుగొమ్ముకు చెందిన నల్లవెల్లి ఆంజనేయులు, భార్య అశ్విని మూడో కాన్పు కోసం పురిటి నొప్పులతో గురువారం రాత్రి దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు వెళ్లింది. అక్కడ డాక్టర్లు లేకపోవడంతో నల్లగొండ దవాఖానకు పంపించారు.

నొప్పులతో నరకయాతన పడుతున్న అశ్వినిని జాయిన్ చేసుకోవాల్సిన నల్గొండలోని డ్యూటీ డాక్టర్, నర్సులు నిర్లక్ష్యంగా మాట్లాడారు. ‘ఇంతకుముందు కాన్పు కాన్పు దేవరకొండలో చేయించుకున్నవ్​కదా.. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినవ్​..బయటకు పో’ అని ఆమెను బయట కుర్చీలోనే కూర్చోబెట్టారు. నొప్పులు వస్తున్నాయని ఎంత వేడుకున్నా కనికరించలేదు. చివరకు ఏం చేయాలో తెలియక వార్డు బయట అటూ ఇటూ తిరుగుతూ నొప్పులు తీవ్రం కావడంతో కుర్చీలో  కూర్చుంది. దీంతో అక్కడే డెలివరీ అయ్యింది. పాప కింద పడబోగా అశ్విని అత్త అందుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.

కొద్దిసేపటికి బయటకు వచ్చిన నర్సులు, డ్యూటీ డాక్టర్​‘ఎన్ని సార్లు చెప్పినా వినవా..వెళ్లమంటే వెళ్లవా’ అంటూ అశ్వినిని, ఆమె కుటుంబసభ్యులను తిడుతూ లోపలికి తీసుకువెళ్లారు. ఇదంతా చూసిన అక్కడున్న రోగులు డాక్టర్, నర్సులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిండు గర్భిణికి డెలివరీ చేయకుండా ఇలాగేనే మాట్లాడేది’ అంటూ  ఫైర్​అయ్యారు. ఇదంతా చూస్తున్న అశ్విని భర్త ఆంజనేయులు ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని కన్నీరు పెట్టుకున్నాడు.  

డాక్టర్లు, నర్సులపై చర్యలు

నల్గొండ జిల్లా దవాఖానలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్ నిఖిత, స్టాఫ్​నర్సులు ప్రమీల, ఉమ, పద్మ, సుజాతకు షోకాజ్​నోటీసులు ఇవ్వాలని డీసీహెచ్​ఎస్​ను ఆదేశించినట్లు స్థానిక సంస్థల అడిషనల్​కలెక్టర్ టి పూర్ణచంద్ర తెలిపారు. అనస్థీషియా డాక్టర్ లేకపోవడంతో దేవరకొండ నుంచి గర్భిణిని నల్గొండకు పంపించారని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన దేవరకొండ డ్యూటీ డాక్టర్ శాంతి స్వరూపతో పాటు, డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సులు విజయలక్ష్మి, సైదమ్మ, మౌని, సరితను సస్పెండ్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. తర్వాత అశ్విని, కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్టు తెలిపారు.