సహజ కాన్పుల కోసం గర్భిణులకు ఎక్సర్సైజ్, యోగా 

సిజేరియన్ కాన్పుల సంఖ్యను తగ్గించేందుకు  ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం డాక్టర్లు అనేక  రకాల ప్రయోగాలు చేస్తున్నారు. సాధారణ ప్రసవాల కోసం గర్భిణులకు ఎక్సర్ సైజ్ లు, యోగా నేర్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జనరల్ హాస్పిటల్ కి వచ్చే గర్భిణులకు డాక్టర్లు సాధారణ ప్రసవాలపై కౌన్సెలింగ్​ ఇస్తున్నారు. గర్భ నిర్ధారణ పరీక్షల సమయం నుంచే శారీరకంగా ఫిట్ గా ఉండేలా ఎక్సర్ సైజ్ లు నేర్పిస్తున్నారు. ఇందుకోసం స్పెషల్ ట్రైనర్ ను ఏర్పాటు చేశారు. లోపల బేబీ ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉండేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. 

చేతులు అటూ ఇటూ తిప్పుతూ.. కిందికి పైకి వంగుతూ.. నడుముని ఊపుతూ... గర్భిణులు యోగాసనాలు వేస్తున్నారు. వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వార్మప్ తో పాటు యోగా, మెడిటేషన్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉన్నామని గర్భిణులు చెబుతున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే గర్భిణుల్లో నాలుగు నెలల గర్భిణి నుంచి కాన్పుకి సిద్దంగా ఉన్న మహిళల వరకు ఇందులో యోగాసనాలు, మెడిటేషన్స్​ చేస్తున్నారు. ఆరోగ్య పరీక్షలకు వచ్చే వారందరితో యోగా, వార్మప్ చేయించిన తర్వాతే పరీక్షలకు వెళ్లేలా చైతన్యం కల్పిస్తున్నామని వైద్య సిబ్బంది చెబుతున్నారు. పాటించాల్సిన ఆరోగ్య,ఆహర సూత్రాలు కూడా నేర్పిస్తున్నామని చెబుతున్నారు. 

ఆస్పత్రికి రోజూ 300మంది గర్భిణులు

నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి 300 మంది వరకు గర్భిణులు వస్తున్నారు. ఎక్సర్సైజ్, యోగా నేర్పించడం ప్రారంభమైన తర్వాత గత ఆగస్టు  నుంచి ఇప్పటివరకు  10 వేల మందికి యోగా, మెడిటేషన్, ఫిజికల్ ఎక్సర్సైజులు నేర్పించామని అధికారులు చెబుతున్నారు. తమ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. ఆస్పత్రిలో 90 శాతం సాధారణ ప్రసవాలే జరుగుతున్నాయని నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్​ ప్రతిమారాజ్ తెలిపారు. నిర్బంధంగా కాకుండా అందరూ స్వచ్ఛందంగా.. సంతోషంగా ఎక్సర్ సైజు, యోగా ప్రాక్టీస్ చేసేలా చైతన్యం చేయడం ప్రారంభించిన తర్వాత మహిళల శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడినట్లు గుర్తించామని వివరించారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెరగటంతో  పేదవాళ్లతో పాటు , మధ్యతరగతి వాళ్లూ  ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు.