నిజామాబాద్/జగిత్యాల, వెలుగు: వర్షాలతో గర్భిణులు అవస్థలు పడ్డారు. చెరువులు తెగడం, వాగులు పొంగి ప్రవహించడంతో దవాఖానలకు పోవడానికి కష్టాలు పడాల్సి వచ్చింది. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని పిప్రీ గ్రామానికి చెందిన నిండు గర్భిణి అనితకు గురువారం పురుటి నొప్పులు వచ్చాయి. పిప్రీ-–బాచన్పల్లిల మధ్య చెరువుకట్ట తెగిపోవడంతో రోడ్డుపైకి నీళ్లొచ్చి రాకపోకలు నిలిచిపోయాయి.
ఆమె భర్త అజయ్, మరో ఇద్దరు కుటుంబసభ్యుల సాయంతో జేసీబీని తెప్పించి అందులో 4 కిలోమీటర్ల దూరంలోని బాచన్పల్లి దాకా తీసుకువెళ్లారు. అక్కడి నుంచి 108లో ఆర్మూర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అలాగే జగిత్యాల జిల్లా భీమారం మండలం రాజలింగం పేట్‌కు చెందిన దేశవేని లతకు పురిటినొప్పులు వచ్చాయి. శివారులోని వాగు పొంగడంతో సర్పంచ్ చారి జేసీబీ తెప్పించారు.
ALSO READ:వానలపై.. పోలీసుల ఫోకస్
ఆమెను ముందు నిల్చోబెట్టి వాగు దాటించారు. అక్కడి నుంచి అంబులెన్సులో కోరుట్ల తీసుకువెళ్లారు. గన్నేరువరానికి చెందిన వేముల సుప్రియకు నొప్పులు రాగా అంబులెన్స్ కు ఫోన్ చేశారు. గన్నేరువరం చెరువు వద్ద కల్వర్టుపై వరద ఉధృతంగా ప్రవహించడంతో ఆంబులెన్స్ దాటలేక తిరిగి వెళ్లిపోయింది. చివరకు పోలీసుల సాయంతో వారి వెహికల్ లో సిద్దిపేట జిల్లా తోటపల్లి మీదుగా కరీంనగర్ హాస్పిటల్‌కు వెళ్లారు.