బురద రోడ్డుపై జీపులో... నిండు గర్భిణి నరకయాతన

  • బురద రోడ్డుపై జీపులో నిండు గర్భిణి నరకయాతన
  • తిప్పలు పడుతూ 30 కి.మీ దూరంలోని పీహెచ్​సీకి...
  • ప్రైవేట్ ​జీపులో తరలించిన కుటుంబసభ్యులు 
  • రెండు గంటల తర్వాత మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి

దహెగాం, వెలుగు: ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులతో అవస్థలు పడుతూ దవాఖానకు వెళ్లడానికి సరైన రోడ్డు లేక బురద రోడ్డులో తిప్పలు పడింది. అంబులెన్స్​కు ఫోన్​ చేయడానికి నెట్ వర్క్​ కూడా లేకపోవడంతో పీహెచ్​సీ చేరేవరకు నరకయాతన అనుభవించింది. చివరకు ఎలాగో పీహెచ్​సీకి చేరుకుని అక్కడే ప్రసవించింది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని రావులపల్లికి చెందిన గిరిజన మహిళ ఆలం భాగ్యలక్ష్మికి నెలలు నిండడంతో సోమవారం పురిటి నొప్పులు వచ్చాయి. ఆమె ఊరు మండల కేంద్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

సెల్​ఫోన్​ నెట్​వర్క్ ఉండదు. సిగ్నల్స్​ రాకపోవడంతో అంబులెన్స్ కు సమాచారం ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో ఆమెను కుటుంబీకులు, ఆశా వర్కర్ ప్రమీల సాయంతో ఊరిలో ఉన్న జీపులో ఎక్కించుకొని హాస్పిటల్ కు బయలుదేరారు. కురుస్తున్న వర్షాలకు రోడ్డు బురదమయం కావడంతో జీపు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ముందుకు వెళ్లిన  ప్రతిసారి టైర్లు జారుతున్నా ధైర్యం చేసి మెల్లి మెల్లిగా ముందుకు పోనిచ్చారు. ఎలాగో రెండు గంటల తర్వాత ఆమెను దహెగాం పీహెచ్ సీకి తరలించారు. అక్కడే డెలివరీ అయి మగ పిల్లవాడికి జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో కుటుంసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికైనా రోడ్లను బాగు చేయాలని కోరుతున్నారు.