ఆస్పత్రిలో లిఫ్ట్‌‌ కూలి బాలింత మృతి..

ఆస్పత్రిలో లిఫ్ట్‌‌ కూలి బాలింత మృతి..
  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు..బిడ్డ క్షేమం
  • ఉత్తరప్రదేశ్‌‌లోని మీరట్‌‌లో ఘటన

లక్నో: ఉత్తరప్రదేశ్‌‌లోని మీరట్‌‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. లోహియా నగర్‌‌లోని క్యాపిటల్ హాస్పిటల్‌‌లో లిఫ్ట్ కూలి బాలింత మృతి చెందింది. ఆస్పత్రిలో పనిచేసే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు హాస్పిటల్‌‌లోని ఫర్నిచర్‌‌ను ధ్వంసం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. కరిష్మా అనే మహిళకు క్యాపిటల్ హాస్పిటల్‌‌లో శుక్రవారం డెలివరీ అయ్యింది. అనంతరం తల్లీబిడ్డను పైఫ్లోర్‌‌ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌‌లోకి షిఫ్ట్ చేయాలని ఆస్పత్రి సిబ్బంది నిర్ణయించారు. 

 తల్లీబిడ్డలతో పాటు మరో ఇద్దరు ఆస్పత్రి ఉద్యోగులు కూడా లిఫ్ట్‌‌ ఎక్కారు. లిఫ్ట్ కిందకు దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా దాని కేబుల్ తెగిపోయింది. లిఫ్ట్ వేగంగా కిందకు కూలింది. సెక్యూరిటీ సిబ్బంది దాదాపు 45 నిమిషాలు శ్రమించి లిఫ్ట్ డోర్ పగలగొట్టి తల్లీబిడ్డను, ఇద్దరు సిబ్బందిని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం వారిని వేరే ఆస్పత్రికి తరలించారు. అయితే.. తల, మెడకు తీవ్ర గాయాలు కావడంతో  కరిష్మా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అదృష్టవశాత్తు ఆమె బిడ్డకు ఎలాంటి గాయలు కాలేదని చెప్పారు. మరో ఇద్దరికి ట్రీట్మెంట్ చేస్తున్నామని వివరించారు.

 కరిష్మా చనిపోవడంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు క్యాపిటల్ హాస్పిటల్‌‌ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. లిఫ్ట్ క్రాష్ అయిన తర్వాత బాధితులను వెంటనే బయటకు తీయకుండా ఘటనా స్థలం నుంచి అందరూ పారిపోయారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. దాంతో ఆస్పత్రిలోని 13 మంది పేషెంట్లను యాజమాన్యం మరొక ఆస్పత్రికి తరలించింది.

లిఫ్ట్  నిర్వహణ లోపమే కారణం!

ఘటనపై చీఫ్‌‌ మెడికల్‌‌ ఆఫీసర్‌‌(సీఎంవో) స్పందించారు. ఓవర్‌‌లోడింగ్‌‌ కారణంగానే లిఫ్ట్‌‌ తెగిపోయి ఉండవచ్చన్నారు.  లిఫ్ట్ మెయింటెనెన్స్ రికార్డులను పరిశీలిస్తామని, నిర్వాహణలో నిర్లక్ష్యం ఉందని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లిఫ్ట్‌‌లో తనిఖీలు జరుగుతున్నాయని, లోపాలు కనిపిస్తే ఆసుపత్రి లైసెన్స్‌‌ను రద్దు చేస్తామని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి సిబ్బంది ప్రస్తుతం పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.