పెద్దపల్లి జిల్లా మంథనిలో…కట్నం కోసం వేధిస్తున్నారని గర్భిణి ఆందోళన

పెద్దపల్లి జిల్లా మంథనిలో…కట్నం కోసం వేధిస్తున్నారని గర్భిణి ఆందోళన

మంథని, వెలుగు : అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, ఇంటి నుంచి బయటకు గెంటేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఓ గర్భిణి రోడ్డుపై బైఠాయించింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఆదివారం జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మంథని పట్టణంలోని పోచమ్మ వాడకు చెందిన రావుల మారుతీప్రసాద్‌‌‌‌‌‌‌‌కు ఖమ్మం జిల్లాకు చెందిన మౌనికతో నాలుగేండ్ల కింద పెండ్లి అయింది. వీరికి రెండేండ్ల బాబు ఉండగా మౌనిక ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. మౌనిక భర్త, మామ కలిసి గత నెల 12న ఆమెను ఇంటికి నుంచి గెంటివేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఖమ్మంలోని తల్లిగారింటికి వెళ్లింది.

అయితే పోలీసులకు ఫిర్యాదు చేసి నెల రోజులు కావొస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆదివారం మంథనికి వచ్చి స్థానిక అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ చౌరస్తాలో బైఠాయించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త మారితీప్రసాద్‌‌‌‌‌‌‌‌ ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతాడని, తాగి వచ్చి కట్నం కోసం వేధిస్తున్నాడని, అతడి తండ్రితో లైంగికంగా కలిసి ఉండాలని చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆరోపించింది.

నెల రోజుల కింద పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ చౌరస్తా వద్దకు చేరుకొని మౌనికను మంథని పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు.