అంబులెన్స్​పోయే దారి లేక.. ట్రాక్టర్​లో బాలింత తరలింపు

ఏటూరునాగారం, వెలుగు: అంబులెన్స్ ​పోయే దారి లేక బాలింతను జీపీ ట్రాక్టర్​లో 8 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి 108లో ఎక్కించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేట జీపీ పరిధిలోని నీలాలతోగు గుత్తికోయ గూడెంకు చెందిన మడకం జ్యోతి వారం క్రితం పురిటి నొప్పులతో ములుగు ఏరియా ఆసుపత్రికి వెళ్లింఇ. జ్యోతికి బ్లడ్​లెవల్​తక్కువ ఉందని వరంగల్​ఎంజీఎంకు వెళ్లమని డాక్టర్లు చెప్పారు. ఎంజీఎంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో తిరిగి ములుగు ఏరియా ఆసుపత్రికి వచ్చారు. డాక్టర్లు జ్యోతికి ఆపరేషన్ చేసి కాన్పు చేశారు. ఆపరేషన్​తర్వాత కుట్లు సరిగా వేయకపోవడం, అవి మానక ముందే ఇంటి దగ్గర వదిలి పెట్టడంతో శుక్రవారం జ్యోతికి బ్లీడింగ్​అయ్యి పరిస్థితి విషమించింది. నీలాలతోగు వరకు 108 వెళ్లడానికి దారి లేకపోవడంతో విషయం తెలుసుకున్న సర్పంచ్​రమ జీపీ ట్రాక్టర్​ పంపించారు. అందులో సుమారు 8 కిలోమీటర్లు తీసుకువెళ్లి 108 వద్దకు చేర్చారు. అక్కడి నుంచి 108 సిబ్బంది ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల నిర్లక్ష్యమే జ్యోతి ఆరోగ్య పరిస్థితి విషమించడానికి కారణమని స్థానికులు ఆరోపించారు.