సర్కారు దవాఖాన మునుగుతదని .. బాలింతలు, గర్భిణుల తరలింపు

మంచిర్యాల, వెలుగు:  మంచిర్యాల గోదావరి ఒడ్డున ఉన్న మాతా శిశు ఆరోగ్యం కేంద్రానికి (ఎంసీహెచ్​) మరోసారి ముంపు ముప్పు ముంచుకొచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం ఎల్లంపల్లి ప్రాజెక్టు 17 గేట్లు ఓపెన్​ చేసి 1.78 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో గోదావరికి ఒక్కసారిగా వరద పోటెత్తెంది. ఇన్​ఫ్లో అంతకంతకూ పెరుగుతుండడంతో ఏ క్షణంలోనైనా ఎంసీహెచ్​ మునిగిపోయే ప్రమాదముందని ఇరిగేషన్​ ఆఫీసర్లు హెచ్చరించారు. దీంతో వైద్యారోగ్యశాఖ అధికారులు శుక్రవారం ఎంసీహెచ్​ను హడావిడిగా ఖాళీ చేశారు. బస్సులు, అంబులెన్సులలో సుమారు 120 మందికి పైగా బాలింతలు, గర్భిణులు, నవజాత శిశువులను హడావుడిగా మంచిర్యాలలోని గవర్నమెంట్​ జనరల్ ​హాస్పిటల్​కు షిఫ్ట్​ చేశారు. 

మరికొందరు ప్రైవేట్​ హాస్పిటల్స్​కు వెళ్లిపోయారు. పేషెంట్లకు అత్యవసరంగా ట్రీట్​మెంట్​అందించేందుకు అవసరమైన మెషీన్లు, మందులు, ఇతర పరికరాలను సైతం జీజీహెచ్​కు తరలించారు. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక పేషెంట్లు, వారి బంధువులు హైరానా పడ్డారు. ఇప్పటికే జీజీహెచ్​లో సరిపడా స్థలం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా ఎంసీహెచ్​ను ఖాళీ చేసి వంద మందికిపైగా పేషెంట్లను, పరికరాలను తరలించడంతో అవస్థలకు గురయ్యారు. మరోవైపు పేషెంట్లను తలించేందుకు అధికార బీఆర్ఎస్​, ప్రతిపక్ష కాంగ్రెస్​ పార్టీల లీడర్లు పోటీపడ్డారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది.  

నిరుడు నీటమునిగిన ఎంసీహెచ్​

నిరుడు జూలైలో 12న గోదావరికి భారీగా వరద రావడంతో ఎంసీహెచ్​ నీటమునిగింది. అంతకుముందు రోజు రాత్రికి రాత్రే పేషెంట్లను జీజీహెచ్​కు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నాలుగు రోజుల పాటు ఎంసీహెచ్​జలదిగ్బంధంలోనే చిక్కుకుంది. విలువైన వైద్య పరికరాలు, మందులు, కేసీఆర్​ కిట్లు, ఫర్నిచర్​ నీటమునిగి రూ.5 కోట్లకు పైగా నష్టం జరిగింది. వరదలకు కుప్పలు తెప్పలుగా కొట్టుకొచ్చిన పాములు ఎంసీహెచ్​లో తిష్టవేశాయి. చాలారోజుల వరకు అటు పోవాలంటేనే జనాలు వణికిపోయారు. అనేక తర్జనభర్జనల తర్వాత ఎట్టకేలకు అధికారులు  ఎంసీహెచ్​కు రిపేర్లు చేపట్టారు. ఆరు నెలల కిందట రీ ఓపెన్​ చేసి పేషెంట్లను తరలించారు. ఈసారి కూడా ముంపు ముప్పు పొంచి ఉండడంతో మరోసారి ఎంసీహెచ్​ను ఖాళీ చేయక తప్పలేదు.  

అనాలోచిత నిర్ణయాలతో ఆగమాగం

ప్రజాప్రతినిధులు, అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్లే ఎంసీహెచ్​కు ఈ దుర్గతి పట్టింది. గోదావరి ఒడ్డున ముంపు ప్రాంతమని తెలిసి కూడా రూ.18 కోట్లతో ఎంసీహెచ్​ను నిర్మించడంపై మొదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ ఎమ్మెల్యే దివాకర్​రావు గాని, అప్పటి కలెక్టర్​ భారతి హోళికేరి గాని పట్టించుకోలేదు. ఎట్టకేలకు ఎంసీహెచ్​ నిర్మాణం పూర్తి చేసి నిరుడు మార్చి 4న మంత్రి హరీశ్​రావుతో ప్రారంభింపజేశారు. ఏప్రిల్ లో గర్భిణులు, బాలింతలకు వైద్యసేవలు ప్రారంభించారు. 

మూడు నెలలు కూడా తిరగకుండానే జులైలో గోదావరికి భారీ వరదలు వచ్చి గ్రౌండ్​ ఫ్లోర్ వరకు మునిగిపోయింది. ఏటా వానకాలంలోనే ఇదే పరిస్థితి ఉంటుందని, పేషెంట్ల సౌకర్యార్థం ఎంసీహెచ్​ను ఐబీలో ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్​, బీజేపీ లీడర్లు డిమాండ్​ చేస్తున్నారు. జీజీహెచ్​ఎదురుగా ఉన్న ఐబీలో ఇంటిగ్రేటెడ్​ వెజ్​, నాన్​వెజ్​ మార్కెట్​ నిర్మిస్తూ ఎంసీహెచ్​ను గోదావరి ఒడ్డున ఏర్పాటు చేయడం కన్నా మూర్ఖత్వం మరోటి ఉందడని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఎంసీహెచ్​ను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచిస్తున్నారు.