- అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డు
- గుజరాత్ టీమ్‌లో తెలంగాణ ప్లేయర్ త్రిష పూజిత
ముంబై : విమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ వేలం ఇండియా యంగ్ క్రికెటర్లపై కాసుల వర్షం కురిపించింది. శనివారం జరిగిన వేలంలో పంజాబ్ యంగ్ పేసర్ కశ్వీ గౌతమ్ లీగ్ చరిత్రలో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. గుజరాత్ జెయింట్స్ 20 ఏండ్ల కశ్వీని రూ. 2 కోట్ల మొత్తంతో తమ టీమ్‌లోకి తీసుకుంది. రూ. 10 లక్షల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన కశ్వీ కోసం గుజరాత్‌తో పాటు యూపీ వారియర్స్ పోటీపడింది. చివరకు బేస్‌ప్రైజ్‌కు 20 రెట్లు ఎక్కువ మొత్తంతో గుజరాత్ తీసుకుంది.
అంతకుముందు మరో అన్‌క్యాప్డ్ ప్లేయర్, కర్నాటక బ్యాటర్ వ్రింద దినేశ్‌ను యూపీ వారియర్స్ రూ. 1.3 కోట్లకు కొనుగోలు చేసింది. వ్రింద, కశ్వీ ఇద్దరూ ఈ మధ్య ఇంగ్లండ్–ఎతో జరిగిన టీ20 సిరీస్‌లో ఇండియా–ఎ తరఫున బరిలోకి దిగారు. తెలంగాణకు చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ త్రిష పూజితను రూ. 10 లక్షల బేస్‌ప్రైజ్‌తో గుజరాత్ టీమ్ ఎంచుకుంది. భద్రాద్రి జిల్లాకు చెందిన త్రిష క్రికెట్‌పై ఇష్టంతో హైదరాబాద్‌కు వచ్చి ఓనమాలు నేర్చుకొని హెచ్‌సీఏ సీనియర్ విమెన్స్ తరఫున సత్తా చాటుతోంది.
సదర్లాండ్‌కు రెండు కోట్లు
ఆస్ట్రేలియా క్రికెటర్ల కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 22 ఏండ్ల ఆల్‌రౌండర్ అనాబెల్ సదర్లాండ్ రూ. 2 కోట్లకు ఢిల్లీ సొంతం అయింది. బ్యాటర్ ఫొయెబె లిచ్‌ఫీల్డ్ రూ. కోటికి గుజరాత్ టీమ్‌లో చేరింది. సౌతాఫ్రికా పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్‌ను ముంబై ఇండియన్స్ రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్‌సీబీ రూ. 60 లక్షలతో ఇండియా వెటరన్ స్పిన్నర్ ఏక్తా బిష్త్, రూ. 40 లక్షలతో ఆసీస్‌కు చెందిన జార్జియా వారెహమ్, రూ. 30 లక్షలతో ఇంగ్లండ్ క్రికెటర్ కేట్ క్రాస్‌ను తీసుకుంది.
తొలుత ఎవ్వరూ పట్టించుకోని ఇండియా వెటరన్ బ్యాటర్ వేదా కృష్ణమూర్తిని చివరి రౌండ్‌లో గుజరాత్ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. భారీ అంచనాలున్న ఇంగ్లండ్ స్టార్ డ్యానీ వ్యాట్‌ను యూపీ వారియర్స్ రూ. 30 లక్షలకే సొంతం చేసుకుంది. కాగా, అత్యధిక బేస్ ప్రైజ్ రూ. 50 లక్షలతో బరిలో నిలిచిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ దియేంద్ర డాటిన్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం విశేషం.
కిమ్ గారెత్ (ఆస్ట్రేలియా), అమీ జోన్స్ (ఇంగ్లండ్), చామరి ఆటపట్టు (శ్రీలంక), డి క్లెర్క్ (సౌతాఫ్రికా), టామీ బ్యూమోంట్ (ఇంగ్లండ్) వంటి స్టార్ ప్లేయర్లనూ ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఇండియన్స్ ప్రియా పూనియా, వేదిక వైద్య, పూనమ్ రౌత్, సుష్మా వర్మ కూడా అన్‌సోల్డ్‌గా మిగిలారు.
30 మందికి రూ. 12.75 కోట్లు
వేలంలో ఐదు ఫ్రాంచైజీలు కలిపి మొత్తంగా 30 మందిని కొనుగోలు చేశాయి. ఇందులో 9 మంది ఫారిన్ ప్లేయర్లు ఉన్నారు. యూపీ పది మంది ప్లేయర్లను తీసుకుంది. వేలంలో అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ. 12.75 కోట్లు ఖర్చు చేశాయి. కాగా, డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫిబ్రవరి రెండో లేదా మూడో వారంలో ఒకే సిటీలోనే జరుగుతుందని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు.
చండీగఢ్ ఎక్స్‌ప్రెస్
చండీగఢ్‌లో పుట్టిన కశ్వీ మంచి సీమర్. చిన్నప్పటి నుంచే సూపర్ టాలెంట్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకుంది. 13 ఏండ్లకే పంజాబ్ అండర్19 టీమ్‌లోకి వచ్చిన ఆమె 2020లో బీసీసీఐ అండర్-19 వన్డే మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌పై హ్యాట్రిక్ సహా -పది వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించింది. ఆ పెర్ఫామెన్స్‌తో డబ్ల్యూపీఎల్‌కు ముందు జరిగిన విమెన్స్ టీ20 చాలెంజ్‌లో ట్రయల్ బ్లేజర్ టీమ్‌లో చోటు దక్కించుకుంది.
ఈ సీజన్ బీసీసీఐ విమెన్స్ టీ20 ట్రోఫీలో ఏడు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టింది. దాంతో అండర్–-23 టీమ్‌లోకి వచ్చిన ఆమె హాంకాంగ్‌లో జరిగిన ఏసీసీ ఆసియా ఎమర్జింగ్ టోర్నీలో బరిలోకి దిగింది. ఇటీవల ఇంగ్లండ్–ఎతో సిరీస్‌లోనూ మెప్పించింది.