- మేల్కోని బల్దియా, వాటర్‌బోర్డు, ఎలక్ట్రిసిటీ ఆఫీసర్లు
- అస్తవ్యస్తంగా నాలాలు, మ్యాన్‌హోళ్లు, ట్రాన్స్ఫార్మర్లు
- నాలాల్లో భారీగా పేరుకుపోయిన పూడిక
- వానలు మోపైతే ఇబ్బందులు తప్పవంటున్న కార్పొరేటర్లు
హైదరాబాద్, వెలుగు:
వచ్చే వానా కాలాన్ని తట్టుకునేందుకు సిటీ రెడీగా ఉన్నట్లు కనిపించడం లేదు. ముందస్తుగా చేయాల్సిన ఏర్పాట్లపై దృష్టి పెట్టకపోవడమే ఇందుకు కారణం. కొన్నేండ్లుగా కొనసాగుతున్న నాలాల పనులను పూర్తిచేయకపోతే జనానికి ఇబ్బందులు తప్పేలా లేవు. మాన్సున్ ప్లాన్ పై జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ, హెల్త్ డిపార్ట్మెంట్ల అధికారులు ముందస్తుగా మేల్కోవడం లేదు. గతేడాది వర్షా కాలంలోపే నాలాల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించినప్పటికీ నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కనీసం డ్యామేజ్ అయిన చోట్ల మ్యాన్ హోళ్లను బాగుచేయడం లేదు. కలుషిత నీటి సమస్యపై చర్యలు తీసుకోవడంలేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు సంబంధించిన పనులు కూడా స్లోగా నడుస్తున్నాయి. కరెంట్ వైర్లకు ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం లేదు. ఐదారు రోజుల క్రితం వరకు కురిసిన వర్షాలకే కాలనీలు నీట మునిగాయి. మరి పూర్తిస్థాయిలో వానలు కురిస్తే గ్రేటర్‌లోని కాలనీల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
టెండర్లు వేస్తున్నారంతే..
మాన్సూన్ యాక్షన్ ప్లాన్‌పై జీహెచ్ఎంసీదే కీలకపాత్ర. కానీ అన్ని డిపార్టుమెంట్లతో కలిసికట్టుగా పనిచేయాల్సిన బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షా కాలంలో సెల్లార్ల తవ్వకాలు బంద్ అని ఓ సర్క్యూలర్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ముంపు సమస్య లేకుండా ఉండేందుకు ప్రారంభించిన 37 నాలాల పనులు ఒకటి రెండు చోట్ల మినహా అన్ని చోట్ల కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఎస్ఎన్డీపీని ఏర్పాటు చేసినా పనులు జరిగింది అంతంత మాత్రమే. ఏదో కారణంతో పనులు స్లోగా సాగుతున్నాయి. నాలుగు సార్లు డెడ్ లైన్ పెట్టినా ఫలితంలేదు. కనీసం పూడిక తీత పనులు కూడా చేయడం లేదు. కొన్ని నాలాల్లో పూడిక పేరుకుపోయి ఐదారు అడుగుల ఎత్తులో చెట్లు పెరుగుతున్నాయంటే క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు పనులకు టెండర్లు వేశామని చెబుతున్నారే కానీ పనులు మాత్రం చేయడం లేదు.
వాటర్ బోర్డు పట్టించుకోవట్లే...
డ్రైనేజీ నిర్వహణలో వాటర్ బోర్డు ఫెయిల్ అవుతూనే ఉంది. వాటర్‌బోర్డు అధికారుల తీరుపై కార్పొరేటర్లు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సిల్ట్ ను తీసుకొచ్చి నేరుగా వాటర్ బోర్డు హెడ్డాఫీస్ముందు పోసి నిరసన తెలిపారంటే కాలనీల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎండా కాలంలో మ్యాన్ హోళ్లు పొంగిపొర్లుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం వాటర్‌బోర్డుకు డైలీ వందల్లో మ్యాన్ హోళ్లకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయి. మ్యాన్‌హోళ్లు కుంగిపోయాయని, మూతలు విరిగిపోయి ప్రమాదకరంగా మారాయని జనం వాపోతున్నారు. అలాగే మంచినీటి నల్లా పైపుల్లో మురుగు కలుస్తోందని వాటర్‌బోర్డు ట్విట్టర్ అకౌంట్‌కు వందల్లో ఫిర్యాదులు వస్తున్నాయి.
చెట్ల కొమ్మలు కొట్టట్లే..
ఈదురు గాలులతో వర్షం కురిసిన టైంలో చెట్ల కొమ్మలు విరిగి కరెంట్వైర్లపై పడి తరచూ విద్యుత్‌సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణం. టెండర్లు వేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారే తప్ప తర్వాత చేస్తున్నా పర్యవేక్షణ ఉండడం లేదు. ఏ ఏరియాలో ఎంతవరకు చేశారనేదానిపై దృష్టిపెట్టడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు నామమాత్రంగా చేస్తున్నారు. ఏటా సగం పనులు కూడా చేయట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. మరో నెల రోజుల్లో వానలు మొదల్యే అవకాశం ఉన్నా నేటికీ ఆ పనులు మొదలుపెట్టలేదు. అలాగే చాలా చోట్ల ట్రాన్స్ ఫార్మర్లకు కంచె లేదు. సిటీలోని సగానికి పైగా ట్రాన్స్ ఫార్మర్లు ప్రమాదపు అంచున ఉన్నాయి. చిన్నపాటి గాలికే పెద్దపెద్ద చెట్ల కొమ్మలు విరిగి పడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్కడికక్కడ కొమ్మలు కొట్టించాలని జనం కోరుతున్నారు.
కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి
ఏటా వానా కాలంలో సిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తుగా ప్లాన్‌చేసి పనులు పూర్తి చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. బల్దియా కౌన్సిల్ మీటింగ్‌లో జనం సమస్యలపై చర్చిద్దామనుకుంటే ఆ అవకాశం లేకుండా చేశారు. 15 – 20 రోజుల్లో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. గతంలో ముంపుకు గురైన ప్రాంతాల్లో ఎలాంటి మార్పు లేదు. వాటర్ బోర్డు పూర్తిగా విఫలమైంది. అండర్ డ్రైనేజీ పనులు అస్సలు జరగడం లేదు. ఇప్పటికైనా మేయర్ విజయలక్ష్మి స్పందించి మాన్సూన్స్పెషల్ మీటింగ్ పెట్టాలి. అలాగే కౌన్సిల్ మీటింగ్ కూడా నిర్వహించాలి.
– కొప్పుల నర్సింహారెడ్డి, మన్సురాబాద్ కార్పొరేటర్