
మంచిర్యాల, వెలుగు: కాంగ్రెస్100 రోజుల పాలనలో మంచిర్యాల నియోజకవర్గంలో రూ.270 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు. బుధవారం తన నివాసంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. నియోజకవర్గంలోని 280 స్కూళ్లలో రూ.17.90 కోట్లతో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నట్టు చెప్పారు. లక్సెట్టిపేట స్కూల్ బిల్డింగ్కోసం రూ.5.80 కోట్లు కేటాయించామన్నారు. మంచిర్యాల, హాజీపూర్, దండేపల్లిలో రెసిడెన్షియల్ స్కూళ్లు తీసుకొస్తామన్నారు. మంచిర్యాల, నస్పూర్, లక్సెట్టిపేట మున్సిపాలిటీలతో పాటు మండలాల్లో రూ.270 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, బ్రిడ్జిలు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నామని వరించారు.
రాళ్లవాగు ముంపు నుంచి రక్షణ కోసం రూ.270 కోట్లతో కరకట్టలకు ప్రపోజల్స్ పంపామన్నారు. రాళ్లవాగుపై రూ.20 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి పనులకు భూమిపూజ చేశామన్నారు. రూ.250 కోట్లతో లక్ష్మీటాకీస్ నుంచి శ్రీశ్రీనగర్ వరకు 100 ఫీట్ల రోడ్డు, ఆర్వోబీ, రూ.172 కోట్లతో దండేపల్లి మండలం తపాల్పూర్ నుంచి లక్సెట్టిపేటలోని కరీంనగర్ చౌరస్తా వరకు రోడ్డు, రూ.18 కోట్లతో కోర్టు బిల్డింగ్ పనులకు ప్రపోజల్స్ రెడీ చేశామని తెలిపారు. మంచిర్యాల ఐబీలోని 4 నాలుగు ఎకరాల్లో 600 బెడ్స్‌తో హాస్పిటల్నిర్మిస్తామని చెప్పారు. వీటితోపాటు చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.