ఖానాపూర్ మున్సిపల్ ​చైర్మన్​పై అవిశ్వాసానికి రంగం సిద్ధం!

  •    30 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఆర్డీవో వెల్లడి

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్ పై రంగం సిద్ధమైంది. వీరిపై అవిశ్వాసానికి 9 మంది కౌన్సిలర్లు నోటీస్​ ఇవ్వగా.. గురువారం ఆర్డీఓ కల్యాణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అవిశ్వాస తీర్మాన ప్రక్రియను 30 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్, వైస్​చైర్మన్​పై అవిశ్వాసానికి 12 మందిలో 9 మంది కౌన్సిలర్లు సంతకం చేసి అప్పటి కలెక్టర్ వరుణ్ రెడ్డికి వినతి పత్రం అందించారు.

అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈ వ్యవహారం వాయిదా పడింది. దీంతో ఆ 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీస్ విషయాన్ని ఈ నెల 11న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ దరఖాస్తును పరిశీలించాల్సిందిగా ఆర్డీవో కళ్యాణిని ఆదేశించగా ఆమె గురువారం పరిశీలించారు. చైర్మన్, వైస్ చైర్మన్ లు అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారైనప్పటికీ సొంత పార్టీ వారు కూడా అవిశ్వాసం ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

వారి పనితీరు పట్ల విసిగిపోయాం

మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్ పనితీరు, వ్యవహార శైలిపై ప్రజలతో పాటు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు తీవ్రంగా విసిగిపోయారని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం అన్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆయన ఆయా పార్టీలకు చెందిన కౌన్సిలర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ ఇద్దరూ పట్టణ అభివృద్ధి కోసం పనిచేయకుండా కేవలం తమ స్వార్థ రాజకీయాల కోసం పదవులను వాడుకుంటున్నారని ఆరోపించారు.

వారి పనితీరును నచ్చక తాము పార్టీలకు అతీతంగా అవిశ్వాస తీర్మానం నోటీసును కలెక్టర్​కు సమర్పించినట్లు చెప్పారు. ఇందులో బీఆర్ఎస్, బీజేపీ,కాంగ్రెస్ కౌన్సిలర్లు కుర్మ శ్రీనివాస్, కిషోర్ నాయక్, ఆఫ్రిన్ ఖానం, ఫౌజియా బేగం, పరిమి లత, విజయలక్ష్మి, కావలి సంతు, నాయిని స్రవంతి, నాయకులు అమనుల్లా ఖాన్, షబ్బీర్ పాషా, పరిమి సురేశ్, జన్నారపు శంకర్ తదితరులు పాల్గొన్నారు.