సీఎం ప్రమాణ స్వీకారం.. వంద ఎకరాల్లో ఏర్పాట్లు

సీఎం ప్రమాణ స్వీకారం.. వంద ఎకరాల్లో ఏర్పాట్లు

పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)  నేత భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.చీఫ్ సెక్రటరీ నుండి డైరెక్టర్ వరకు అధికారులందరి ప్రస్తుతం ఈ పనుల్లో బిజి బిజీగా ఉన్నారు. ముమ్మరంగా సన్నాహాక ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 16న షహీద్ భగత్ సింగ్ (SBS) నగర్ జిల్లాలోని ఖట్కర్ కలాన్‌లో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి  ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు 4-5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి ఎ.వేణు ప్రసాద్ తెలిపారు. 

లక్షమంది కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరిన్ని సీట్లు కూడా వేస్తున్నామన్నారు. వేదిక విస్తీర్ణం 100 ఎకరాల అని తెలిపారు. ప్రధాన ఈవెంట్ కోసం 50 ఎకరాలు మరియు పార్కింగ్ కోసం 50 ఎకరాలు కేటాయించామన్నారు. వేడుకను దృష్టిలో ఉంచుకుని ప్రజల కోసం  ప్రయాణ ఏర్పాట్లు చేశామన్నారు. తాగునీరు, పారిశుధ్యం, వైద్య అత్యవసర సేవలు మొదలైన ప్రాథమిక సౌకర్యాల కోసం “మైక్రో లెవల్” ప్రణాళికను రూపొందించినట్లు డిప్యూటీ కమిషనర్ విశేష్ సారంగల్ తెలిపారు. చీఫ్ సెక్రటరీ, పంజాబ్ డిజిపి మరియు ఇతర సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించామన్నారు. వివిధ జిల్లాల నుంచి సివిల్, పోలీసు అధికారులను కూడా ఇక్కడ మోహరించినట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 వేల నుంచి 10 వేల మంది పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేశారు. అవసరమైతే మరింత మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తామని డీజీపీ చెప్పారు.

కార్యక్రమానికి వచ్చే నేతలు,ఇతర అధికారుల కోసం ప్రోటోకాల్ పాటిస్తూ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మొత్తం ఎనిమిది పార్కింగ్ స్థలాలు ఉంటాయన్నారు అధికారులు. వివిధ విభాగాలుగా వాటిని విభజించి పార్కింగ్ కోసం కేటాయించారని తెలిపారు. ఇటీవలే జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘనవిజయం సాధించింది. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న భగవంత్ మాన్ మార్చి 16న స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలాన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భగవంత్ మాన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

ఆశిష్ మిశ్రా బెయిల్‌ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ

ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో హోలీ ఆడిన సీఎం