
మహబూబ్నగర్ వెలుగు ఫొటోగ్రాఫర్ : పేదల తిరుపతిగా పేరుగాంచిన మహబూబ్నగర్ జిల్లా రూరల్ మండలంలోని మన్యంకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం బుధవారం అర్ధరాత్రి వైభవంగా జరిగింది. అంతకుముందు గరుడ వాహనంపై వేంకటేశ్వర స్వామిని ఊరేగించారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రజలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
వివిధ ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్లపై వచ్చి స్వామిని దర్శించుకున్నారు.క్షేత్రంలోని కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి స్వామికి మట్టి కుండలో పచ్చి పులుసు, అన్నం వండి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి దర్శనం కోసం ఉదయం నుంచి క్యూ కట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ మైదానంలో రకరకాల షాపులు ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ జానకి బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించి పోలీస్ ఆఫీసర్లకు సూచనలు చేశారు. పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, లైబ్రరీ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అలహరి మధుసూదన్ పాల్గొన్నారు.