కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇస్తే ఊరుకోం.. బయట పడ్డ వర్గ విభేదాలు

కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇస్తే ఊరుకోం.. బయట పడ్డ వర్గ విభేదాలు
  • కాంగ్రెస్ సన్నాహాక సమావేశం రసాభాస
  • మధ్యలో నుంచే వెళ్లిపోయిన భట్టి విక్రమార్క
  • కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీహెచ్
  • కలిసి నడవాలని పొంగులేటి సూచన 

ఖమ్మం టౌన్, వెలుగు:  ఖమ్మం డీసీసీబీ కార్యాలయంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ సన్నాహాక సమావేశం రసాభాసగా మారింది.  వేదికపై ఉన్న నేతల అనుచరులు టికెట్ విషయంలో అన్యాయం జరిగితే ఊరుకోమని నాయకులను హెచ్చరించారు.  కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని, జెండాను భుజంపై మోసిన వ్యక్తులనుకాదని.. పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్లకే టిక్కెట్ కేటాయిస్తే ఊరుకోబోమని ఆందోళన చేపట్టారు.  దీంతో ఖమ్మం కాంగ్రెస్ లో వర్గ విబేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.  

ఈ సమావేశానికి ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జ్, మహారాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నసీంఖాన్‌‌తో కలిసి భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీహెచ్‌‌  మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు హాజరయ్యారు. కాగా  సన్నాహక సమావేశాన్ని ఉద్దేశించి వీహెచ్ మాట్లాడుతుండగా కార్యకర్తలు ‘ఖమ్మంలో మీ అజమాయిషీ ఏంటి...? మిమ్ములను ఎవరు పిలిచారు అని ప్రశ్నించడంతో వివాదం చోటు చేసుకుంది’.  దీంతో వీహెచ్  ఆగ్రహం వ్యక్తం చేశారు.  నేతలు సముదాయించడంతో వీహెచ్ కూర్చున్నారు.  ఇటు వివాదం జరుగుతుండగానే సమావేశం మధ్యలో నుంచి ఎమ్మెల్యే  భట్టి విక్రమార్క వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. 

బహిరంగ సభకు సిద్ధం కావాలి

ఈ నెల 18న హైదరాబాద్‌‌లో ని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు, ఇప్పటి నుంచే జిల్లాలు, నియోజక వర్గ, మండల, బూత్ లెవెల్‌‌లోని కార్యకర్తలతో సభలు సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సూచించారు.  సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.  బహిరంగ సభలో చారిత్రాత్మక డిక్లరేషన్లు కాంగ్రెస్ అగ్ర నేతలు  ప్రకటిస్తారని చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు కలిపి బాధ్యులను నియమించిందని తెలిపారు.

 క్షేత్రస్థాయిలో  ప్రజా సమస్యలపై ఏఐసీసీకి స్పష్టమైన చార్జిషీట్ సమర్పించేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.  ఈ నెల18 న సభలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించే గ్యారంటీ కార్డ్స్ ను ప్రతి గడపకు ఇవ్వనున్నట్లు తెలిపారు.  సమావేశంలో డీసీసీబీ జిల్లా అధ్యక్షుడు  పువ్వాళ్ల దుర్గాప్రసాద్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం  వీరయ్య, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్,  సీనియర్ లీడర్లు రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు,  పత్వాల్, సిటీ అధ్యక్షుడు  జావీద్ తదితరులు పాల్గొన్నారు.

టికెట్ల విషయంలో  తుది నిర్ణయం ఏఐసీసీదే

సన్నాహక సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...  అభ్యర్థుల ప్రకటన ఇక్కడ ఉన్న ఏ ఒక్కరి చేతుల్లో  లేదన్నారు. తుది నిర్ణయం ఏఐసీసీ దేనని తెలిపారు. అధికారం, పదవులు రాక ముందు పొట్లాట వద్దన్నారు.  బీఆర్‌‌‌‌ఎస్‌‌కు వణుకు పుట్టే విధంగా 18న జరిగే బహిరంగ సభ ను సక్సస్ చేయాలని కోరారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు గెలుచుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  

మాజీ మంత్రి  రేణుక చౌదరి మాట్లాడుతూ...   పార్టీని నమ్ముకుని, అన్ని విధాలుగా నష్టపోయినా  పార్టీ శ్రేణులకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు.  అమాయకులను జైలుకు పంపే నేతలకు బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో   రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు.  నియోజకవర్గాల వారీగా సంప్రదింపులు జరిపి అభిప్రాయాలు తీసుకుంటానని ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జి నసీం ఖాన్ తెలపడంతో కార్యకర్తలు ఆందోళన విరమించారు.