- ఏపీ జిల్లాల వైద్యాధికారులకు హెల్త్ డైరెక్డర్ డాక్టర్ గీతా ప్రసాదిని ఆదేశాలు
- భవిష్యత్తులో మూడో వేవ్ కు అనుగుణంగా ముందస్తు చర్యలు: డాక్టర్ గీతా ప్రసాదిని
అమరావతి:రాష్ట్రంలో ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లుల జాబితాను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల వైద్యాధికారులకు ఏపీ హెల్త్ డైరెక్డర్ డాక్టర్ గీతా ప్రసాదిని ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ దీనిపై సమీక్షించి ఇప్పటికే పలు ఆదేశాలిచ్చారని ఆమె గుర్తు చేశారు. భవిష్యత్తులో కోవిడ్ మూడోవేవ్ వ్యాప్తికనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు వెంటనే టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డాక్టర్ గీతాప్రసాదిని వెల్లడించారు.
ఒకరోజు ముందే టోకెన్లు జారీ
ప్రతి గ్రామంలోనూ ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లుల జాబితాను సిద్ధం చేసేలా వైద్యాధికారుల్ని సన్నద్ధం చేయాలని ఆమె సూచించారు. అర్హులైన తల్లులందరికీ ఒక రోజు ముందుగానే వ్యాక్సినేషన్ టోకెన్లు పంపిణీ చేయాలని వైద్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గీతా ప్రసాదిని ఆదేశించారు. టోకెన్లో సూచించిన తేదీ, సమయం ప్రకారం ఎఎన్ ఎంలు ,ఆశా కార్యకర్తలు చర్యలు తీసుకోవాలన్నారు. వీరంతా కలసి సమన్వయం చేసుకుని సమీపంలోని కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలకు వారిని తరలించి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని డాక్టర్ గీతాప్రసాదిని సూచించారు.