వ్యాక్సిన్ పంపిణీకి మెకానిజం రెడీ చేయండి

వ్యాక్సిన్ పంపిణీకి మెకానిజం రెడీ చేయండి
  • సీఎంలకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశం
  • 130 కోట్ల మందికి టీకా సజావుగా అందేలా ఓ వ్యవస్థ ఉండాలి
  • కేసులు తగ్గుతున్నాయని నిర్లక్ష్యం వద్దు
  • ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచండి..
  • పాజిటివ్ రేటు 5 శాతం కంటే తక్కువ ఉండేలా చర్యలు తీసుకోండి
  • వెంటిలేటర్ల సరఫరాకు పీఎం కేర్స్ ఫండ్ వాడుకోండి

న్యూఢిల్లీ, వెలుగు: కరోనా వ్యాక్సిన్​ను పంపిణీ చేసేందుకు అవసరమైన ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులను ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. 130 కోట్ల మందికి వ్యాక్సిన్ సజావుగా పంపిణీ చేసేలా ఓ వ్యవస్థ ఉండాలని చెప్పారు.

కరోనా కేసులు పెరుగుతున్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం మాట్లాడారు. తర్వాత వ్యాక్సిన్ పంపిణీ స్ట్రాటజీపై చర్చించేందుకు సీఎంలు, ఇతర ప్రతినిధులతో రివ్యూ చేశారు. కరోనా స్ట్రాటజీపై రాతపూర్వకంగా ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని సీఎంలను కోరారు. అందరూ కలిసి పని చేయాలని కోరారు.

ఎప్పుడు వస్తుందో తెలియదు.. నిర్లక్ష్యం వద్దు

కరోనా కేసులు తగ్గుతున్నాయని నిర్లక్ష్యం వద్దని ప్రధాని సూచించారు. కేసుల పాజిటివ్ రేటు 5 శాతం కంటే తక్కువ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరణాల రేటు 1 శాతం లోపే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ‘‘వైరస్ ట్రాన్స్​మిషన్​ను తగ్గించేందుకు మన ప్రయత్నాల్లో స్పీడ్ పెంచాలి. టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్​కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి” అని కోరారు. రికవరీ, మరణాల రేటు విషయంలో మిగతా దేశాలతో పోలిస్తే ఇండియా ఎంతో ముందు ఉందని చెప్పారు. ‘‘వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అది మన చేతుల్లో లేదు. వ్యాక్సిన్ తయారు చేస్తున్న సైంటిస్టులపై అంతా ఆధారపడి ఉంది” అని మోడీ చెప్పారు. వ్యాక్సిన్​పై కొందరు రాజకీయాలు చేస్తున్నారంటూ పరోక్షంగా రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు.

వ్యాక్సిన్ల అభివృద్ధిని గమనిస్తున్నం

వ్యాక్సిన్ల అభివృద్ధిని తమ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని మోడీ చెప్పారు. గ్లోబల్ రెగ్యులేటర్లు, ఇతర దేశాల ప్రభుత్వాలు, సంస్థలు, అంతర్జాతీయ సంస్థలతో పాటు ఇండియన్ డెవలపర్లు, తయారీదారులతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. కరోనాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ప్రతి ప్రాణాన్ని కాపాడటంపై దృష్టి పెట్టినట్లే.. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ చేరేలా చూడటమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. టెస్టింగ్ నుంచి ట్రీట్​మెంట్ దాకా దేశంలో భారీ నెట్‌‌వర్క్ బాగా నడుస్తోందని.. ఇది క్రమం తప్పకుండా పెరుగుతోందని ప్రధాని చెప్పారు.

నాలుగు దశలుగా ప్రజల రియాక్షన్..

కరోనా విషయంలో ఇప్పటిదాకా ప్రజలు రియాక్టయ్యే తీరు నాలుగు దశలుగా ఉందని మోడీ చెప్పారు. తొలి దశలో ప్రజలు భయపడ్డారని చెప్పారు. రెండో దశలో వైరస్ గురించి సందేహాలు పెరిగాయని, తాము వైరస్ ప్రభావానికి లోనైన సంగ‌‌తిని ఇత‌‌రుల‌‌కు తెలియ‌‌కుండా దాచిపెట్టడానికి ప్రయత్నించారని తెలిపారు. మూడో దశలో పరిస్థితిని ‘అంగీకరించడం’ మొదలు పెట్టారని, ఎంతో జాగ్రత్త వహించారని చెప్పారు. కానీ నాలుగో దశలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. రికవరీ రేటు పెరుగుతుండటంతో జనంలో నిర్లక్ష్యం పెరిగిందన్నారు. భయాన్ని వదిలి, వైరస్ చిన్నపాటి జ్వరం అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చారన్నారు. ఇప్పుడు ఈ నాలుగో స్టేజ్​లో ప్రజల్లో మళ్లీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

పొల్యూషన్ వల్లే కేసుల పెరుగుదల: కేజ్రీవాల్

దేశ రాజధానిలో కరోనా కేసులు పెరగడానికి ఎయిర్ పొల్యూషనే కారణమని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు. పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చకుండా జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు. ‘‘థర్డ్ వేవ్ ఎక్కువగా ఉండటానికి ఎన్నో కారణాలున్నాయి. ఇందులో పొల్యూషన్ ముఖ్యమైనది” అని తెలిపారు. ఈనెల 10న 8,600 కేసులు నమోదయ్యాయని, అప్పటి నుంచి కేసుల సంఖ్య, పాజిటివ్ రేటు తగ్గుతోందని చెప్పారు. థర్డ్ వేవ్ నుంచి బయట పడేదాకా ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1000 అదనపు బెడ్లను కరోనా పేషెంట్లకు రిజర్వ్ చేయాలని కోరారు.

తమ రాష్ట్రంలో కరోనా పరిస్థితి అండర్ కంట్రోల్​లో ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కొత్త కేసుల సంఖ్య తగ్గుతోందని చెప్పారు. వేగంగా వ్యాక్సినేషన్ చేపట్టేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు.

టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం: ఉద్ధవ్

కరోనా వ్యాక్సిన్ పంపిణీ, వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. వ్యాక్సిన్ డెవలప్​మెంట్​గురించి తెలుసుకునేందుకు సీరమ్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదర్ పూనావాలాతో టచ్​లో ఉంటున్నామన్నారు. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

ముందు హెల్త్ వర్కర్లకే

‘‘తొలిదశలో వ్యాక్సిన్​ను హెల్త్ వర్కర్లకే ఇస్తామని ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు. రెండో దశలో పోలీసు సిబ్బందికి, శానిటేషన్ వర్కర్లకు ఇస్తామని చెప్పారు. 50 ఏండ్లు పైబడిన వారికి మూడో దశలో, ఇతర రోగాలు ఉన్న వారికి నాలుగో దశలో వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు” అని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ వెల్లడించారు. తమ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కంట్రోల్ లోనే ఉందని చెప్పారు. పేషెంట్లకు కావాల్సినన్ని బెడ్లు అందుబాటులోనే ఉన్నాయని తెలిపారు.

లెక్కలు కాదు.. మీ వ్యూహమేంటో చెప్పండి

వీడియో కాన్ఫరెన్స్​లో హర్యానా సీఎం మనోహర్‌‌‌‌లాల్ ఖట్టర్ మాట్లాడుతుండగా మధ్యలో ప్రధాని జోక్యం చేసుకున్నారు. కరోనా లెక్కలు చెప్పకుండా.. వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలు, వ్యూహాలేంటో చెప్పాలని సూచించారు. తొలుత మాట్లాడిన ఖట్టర్.. హర్యానాలో రోజూ 2 వేల వరకు కేసులు నమోదవుతున్నాయన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ గురించి చెబుతుండగా కూడా మోడీ అడ్డుకున్నారు. ‘‘మనోహర్ జీ.. మా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి. కరోనాను అడ్డుకునేందుకు మీ దగ్గర ఉన్న ప్లాన్లు ఏంటో చెప్పండి” అని సూచించారు.